అన్నింటినీ నమ్మొద్దు : వండర్ వీడియో పెట్టిన హైదరాబాద్ సిటీ పోలీస్

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. పనికి వచ్చే న్యూస్ కంటే పనికిరాని న్యూస్ ఎక్కువ వైరల్ అవుతాయి. కొంతమంది ఆకతాయిలు పనికట్టుకుని మరి ఫేక్ న్యూస్ వైరల్ చేస్తుంటారు. అది నిజమే ఫేకో తెలియకుండానే చూసిన నెటిజన్లు తెగ షేర్ చేస్తుంటారు. ఇలాంటి ఫేక్ న్యూస్ విషయంలో జర జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి న్యూస్ నమ్మొద్దని చెబుతున్నారు.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా సిటీ పోలీసులు ఓ వీడియోను అధికారిక ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియోలో నడిరోడ్డుపై ఓ కుక్క పడుకుని ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ రోడ్డుపై వెళ్లే వాహనాలన్నీ కుక్క మీద నుంచి వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. నిజానికి అక్కడ అసలు కుక్క లేనే లేదు. వీడియోను ఓసారి దగ్గరగా పరీక్షించి చూడండి. ఎవరో వీడియోను మార్పింగ్ చేసి రోడ్డుపై కుక్క పడుకున్నట్టుగా చిత్రీకరించారు.
నిజానికి కుక్క రోడ్డుపై పడుకుని ఉంటే.. వాహనాలు మీదుగా వెళ్తే అది కొంచెమైనా కదలాలి కదా? పైగా కుక్క కింది వైపునుంచి వాహనాలు వెళ్తున్నాయి చూడండి.. సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజాలు కాదు.. కొన్నిసార్లు ఇలాంటి ఫేక్ వీడియోలు కారణంగా అందరిని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా ఇలాంటి ఫేక్ వీడియోలు చూసి నమ్మి మోసపోకండి అని అంటున్నారు సిటీ పోలీసులు. వైరల్ అవుతున్న వీడియో ఇదే…
Don’t Trust Every Post in Social Media. pic.twitter.com/kpeg8K872S
— Hyderabad City Police (@hydcitypolice) November 2, 2019