గణపతి బప్పా మోరియా : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. వినాయక చవితి అనగానే ఫుల్ జోష్. చిన్నా..పెద్ద అనే తేడా ఉండదు. గల్లీ గల్లీల్లో మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. పూజకు కావాల్సిన సామాగ్రీని, వినాయక విగ్రహాల కోనుగోలుతో మార్కెట్లు కిటకిటలాడాయి. విభిన్న ఆకారంలో భక్తులకు వినాయకుడు దర్శనమిస్తున్నారు.
వినాయకచవితి అనగానే ఖైరతాబాద్ గణేషుడు గుర్తుకు వస్తాడు. ఈసారి కూడా వినాయకుడు అందంగా ముస్తాబయ్యాడు. విగ్రహాలకు అధిపతి అయిన సూరీడు రూపంలో దర్శనమిస్తున్నాడు. రూ. కోటి వ్యయంతో 61 ఫీట్ల విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 12 తలలు, 24 చేతులు, గుర్రాలతో సూర్యావతరంలోని స్వామి వారిని అందంగా ముస్తాబు చేశారు. బాలాపూర్ గణేశుడు కొలువు తీరాడు. మండపక ఆకారం విశేషంగా ఆకట్టుకొంటోంది.
తూర్పుగోదావరి జిల్లా అయినవెల్లి విఘ్నేశ్వరుని ఆలయంలో వినాయక చవితి మహోత్సవాలు అంగరంగవైభవంగా జరిగాయి. రెండో కాణిపాకంగా విరాజిల్లుతున్నటువంటి విఘ్నేశ్వరుని ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తుల తోపాటు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యలు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. వాఢవాడలా ఘననాధుడు పూజలందుకుంటున్నారు. పూజా కార్యక్రమాలు ప్రారంభమవ్వడంతో చవితి పందిళ్ళ వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. విగ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో భవానీపురంలో భారీ గణనాదుడ్ని ఏర్పాటు చేశారు. విశాఖ మురళీనగర్ లో క్రియేటివ్ యూత్ ఏర్పాటు చేసిన 52 అడుగులు విగ్రహం ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటుంది. 21 రోజులు పాటు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడే నిమజ్జనం చేయ్యనున్నారు. వినాయకుని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అంతే కాక అనాథ పిల్లలకు అన్నదానం కార్యక్రమం చేసి వారికి కూడా పండుగ చేస్తామంటున్నారు.
విశాఖలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. విశాఖ లో ప్రసిద్ధి గాంచిన సంపత్ వినాయగర్ ఆలయంలో గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. 9 రోజులు పాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.
హన్మకొండలోని వేయిస్థంభాల ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను మంత్రి దయాకర్ రావు ప్రారంభించారు. సతీ సమేతంగా గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మట్టి వినాయకులను పెట్టి పూజలు చేయాలనే సంకల్పం విజయవంతమైందన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే ప్రజారంజక పథకాలకు విఘ్నాలు తొలగాలని వినాయకుడిని వేడుకున్నట్లు వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణములో గణనాథుల అమ్మకాలు జోరుగా కొనసాగాయి. గత కొన్ని సంవత్సరాలుగా లేని విధముగా, ఈ ఏడాది బొజ్జ గణపయ్య విగ్రహాల అమ్మకాలు హాట్ కేకులా అమ్ముడయ్యాయి. చిన్న విగ్రహాల నుండి మొదలుకొని 15 ఫీట్ల వరకు విగ్రహాలను వినాయక మండప నిర్వాహకులు నెలకొల్పారు. సిరిసిల్ల పట్టణముతో పాటుగా చుట్టూ ప్రక్కల గ్రామాల వినాయక మండప నిర్వాహకులు పెద్ద మొత్తములో గణపయ్యలను కొనుగోలు చేసి తీసుకవెళ్లుతున్నారు.