అలర్ట్ మెసేజ్ : రోడ్లన్ని బిజీ..ఆలస్యంగా వెళ్లండి

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 02:26 AM IST
అలర్ట్ మెసేజ్ : రోడ్లన్ని బిజీ..ఆలస్యంగా వెళ్లండి

Updated On : September 25, 2019 / 2:26 AM IST

మంగళవారం(సెప్టెంబర్ 24, 2019) సాయంత్రం 4.45 గంటలవుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్ లో ఎడతెగని వర్షం పడుతోంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై ఉన్న వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. కావున ఈ సమయంలో ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లాలనుకునే ఉద్యోగులు కాస్త ఆలస్యంగా బయటకు వస్తే మంచిది…ఇది గచ్చిబౌలిలోని విప్రో కంపెనీలో పని చేస్తున్న అరుణ్ అనే ఉద్యోగి సెల్ ఫోన్ కు వచ్చిన సంక్షిప్త సమాచారం.

దీన్ని ఎవరు పంపించారా అని చూస్తే సైబారాబాద్ కాప్ పేరుతో వచ్చింది. ఇది ఒక్క ఆరుణ్ కే కాదు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని ఐటీ కారిడార్ లో పని చేస్తున్న ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ కు వెళ్లిన సారాంశమదీ.

ఐటీ ఉద్యోగులతోపాటు ఈ ఐటీ కారిడార్ లో జర్నీ చేసే ప్రతి ఒక్కరికీ ఈ సమాచారం చేరవేయడంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సఫలీకృతమయ్యారు. ఇలా గతేడాది మొదలైన ఈ అలర్ట్స్ ఇటీవల వేగవంతమైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వీసీ సజ్జనార్ మార్గదర్శనంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీసు బృందాలు సోషల్ మీడియా వేదికగా నగర వాసులను అప్రమత్తం చేస్తున్నాయి.

ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ తీవ్రతను పసిగట్టేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించారు. వీళ్లు గూగుల్ మ్యాప్స్ లోని కలర్ కొడింగ్స్ ద్వారా ట్రాఫిక్ రద్దీని గుర్తించి సంబంధిత ట్రాఫిక్ పోలీసు సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితిని వివరిస్తూ ప్రజలకు ఎస్ఎంఎస్ లతో పాటు వాట్సాప్ మెసేజ్, సోషల్ మీడియా ద్వారా అప్రమత్తం చేస్తున్నారు.