చెరువుల్లా మారిన రోడ్లు : వాహనదారులకు చుక్కలు చూపించిన వాన

నగరాన్ని వాన ముంచెత్తింది. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం వాహనదారులకు చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి పోయింది. ముందుకు వెళ్లలేక..వెనక్కి వెళ్లలేక నరకయాతన పడ్డారు. ఆరుగంటలకు పైగానే వర్షం కురిసింది. చిన్నపాటి వర్షానికే జలమయమయ్యే రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. నాలాలు ఉప్పొంగి వరద నీరు రోడ్ల పైకి చేరడంతో చాలాచోట్ల రోడ్లు కూడా చెరువులను తలపించాయి.
ఎక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉందోనన్న భయంతో వాహనదారులు మెళ్లిగా వెళ్లారు. వాహనాలు మొరాయించడం, భారీగా నీరు ఉండడంతో ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సుల్లో వెళ్లే వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. రోడ్లపై ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయి.. ఇంటికి వెళ్లే దారి తెలియక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.
గచ్చిబౌలి-హైటెక్ సిటీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్ సిటీ ప్రాంతంలోని ఐకియా పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గచ్చిబౌలిలోని ఇనార్బిటాల్ మాల్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, అమీర్‌పేట, ఖైరతాబాద్, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బోయిన్‌పల్లి హైవేపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి.
కొన్నిచోట్ల వరద ప్రవాహం ధాటికి రోడ్డుపై నిలిపిన బైక్‌లు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వృక్షాలు నేలకొరిగాయి సికింద్రాబాద్ – బేగంపేట, పంజాగుట్ట – జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, దిల్ సుఖ్ నగర్ – కోఠి, మాదాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పై నుంచి వాన, ముందుకు వెళ్లలేక..గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకపోయారు.