హుస్సేన్ సాగర్ శుద్ధికి కొత్త విధానాలపై HMDA ప్లాన్!

  • Published By: sreehari ,Published On : October 10, 2020 / 08:06 PM IST
హుస్సేన్ సాగర్ శుద్ధికి కొత్త విధానాలపై HMDA ప్లాన్!

Updated On : October 10, 2020 / 8:18 PM IST

Hyderabad Hussain sagar : హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌ను మొత్తం ఖాళీ చేస్తామన్నారు. పూడిక తీస్తామన్నారు. పూర్తి మంచినీటి చెరువుగా మార్చేస్తామన్నారు. కానీ.. ఏళ్లు గడుస్తున్నా.. అది అలాగే ఉంది. సాగర్ క్లీనింగ్‌పై.. ఇప్పటికీ స్పష్టత లేదు. నెలకు లక్షలు ఖర్చవుతున్నా.. హుస్సేన్ సాగర్‌లో ఒరిగిందేమీ లేదు.



ఇప్పుడు మరోసారి.. సాగర్‌లోకి వచ్చే వ్యర్థాలను అరికట్టేందుకు రెడీ అవుతోంది హెచ్ఎండీఏ. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ను పూర్తిగా శుద్ధి చేస్తామని.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం.



అందుకు తగ్గట్లుగా.. చర్యలు తీసుకోవాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. అప్పట్లోనే.. హుస్సేన్ సాగర్ శుద్ధి చేసేందుకు.. ఆస్ట్రియా దేశానికి చెందిన ప్రతినిధి బృందం సాగర్‌ని పరిశీలించింది. ఆస్ట్రియాలోని డాన్యూబ్ నదిని శుద్ధి చేసినట్లుగానే.. హుస్సేన్‌సాగర్‌ని క్లీన్ చేసేందుకు అవకాశం ఉందన్నారు అధికారులు.



కానీ.. తర్వాత ఆస్ట్రియా టీమ్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు. అది.. అక్కడితోనే ఆగిపోయింది. ఆ తర్వాత.. కెనడాకు చెందిన ఓ స్వచ్ఛంధ సంస్థ.. సోలార్ సిస్టమ్ ద్వారా సాగర్ నీటిని శుద్ధి చేస్తామని పెద్ద ప్రయోగమే చేసింది. ఆ సమయంలో.. కాస్త మార్పు కనిపించిందని అధికారులు చెప్పినా.. అదేమంతగా వర్కవుట్ కాలేదు.



ఇక.. హుస్సేన్ సాగర్ రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం HMDA ప్రతి నెలా అరకోటికి పైనే ఖర్చు చేస్తోంది. 55 MLDల మురుగునీటిని ట్రీట్ చేసేందుకు.. 25 లక్షలు ఖర్చవుతోంది. సాగర్‌లోకి వస్తున్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి.. శుద్ధి చేసేందుకు ప్రత్యేక మెషీన్లు తెప్పించారు. వాటి నిర్వహణకు 6 లక్షలు, 90 మంది దాకా ఉన్న సిబ్బందికి ప్రతి నెలా 5 లక్షలు ఖర్చు చేస్తోంది హెచ్ఎండీఏ.



నాలాల మళ్లింపు కోసం 3 లక్షలు, బయోరెమిడేషన్ కోసం మరో 30 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇలా.. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం నెలకు 69 లక్షలు ఖర్చు చేస్తోంది హెచ్ఎండీఏ. బయోరెమిడేషన్ సిస్టమ్‌తో.. సాగర్‌లోని నీటిలో ఆక్సిజన్ లెవెల్ కూడా కొంతమేర పెరిగిందని అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఐతే.. జూన్ చివరి నుంచి ఈ ప్రోగ్రామ్ నిలిచిపోయింది.



ఐతే.. సాగర్ శుద్ధి కోసం కొత్త విధానాలు పాటించేందుకు ప్లాన్ చేస్తోంది హెచ్ఎండీఏ. ఇందుకోసం.. హైదరాబాద్ ఐఐటీ, జేఎన్టీయూ ప్రొఫెసర్లు, మరికొందరు నిపుణులతో కమిటీ వేశారు. వారు.. జాతీయ, అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అధునాతన టెక్నాలజీతో.. సాగర్ శుద్ధికోసం అవసరమైన అంశాలను స్టడీ చేసి హెచ్ఎండీఏకు రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఇందుకనుగుణంగా.. హుస్సేన్ సాగర్ శుద్ధికి.. టెండర్లు ఆహ్వానించడంపై హెచ్ఎండీఏ దృష్టిపెట్టనుంది. మరికొద్దిరోజుల్లోనే ఈ అంశంపై స్పష్టత వస్తుందని అధికారికవర్గాలు చెబుతున్నాయ్.