బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై రౌడీషీట్

  • Published By: chvmurthy ,Published On : December 18, 2019 / 01:24 PM IST
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై రౌడీషీట్

Updated On : December 18, 2019 / 1:24 PM IST

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హైదరాబాద్ మంగళహాట్ పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ఈ మేరకు పోలీసులు తయారు చేసిన రౌడీ షీటర్స్ జాబితాను మంగళవారం (డిసెంబర్ 17న) విడుదల చేశారు. రౌడీ షీట్ లిస్టులో తనపేరు ఉండటంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. తనపై రౌడీషీట్ నమోదైన విషయాన్ని తమ పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.

రౌడీషీటర్స్ జాబితాలో రాజాసింగ్ పేరు 24వ స్దానంలో ఉంది. కొంతమంది బీజేపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్ కు వెళ్ళి లిస్టు చూసి… ఫోటో తీసి రాజాసింగ్ కు పంపించటంతో ఈ విషయం బయటపడింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రజా సేవ చేస్తున్న తన పేరు రౌడీ షీట్ లో పెట్టటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు రాజాసింగ్. ఇది తెలంగాణ పోలీసుల అసలు స్వరూపమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు.. ఎమ్మెల్యేలపై కూడా గతంలో రౌడీ షీట్లు ఉన్నాయని… వారిని రౌడీషీట్‌లో ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. రౌడీషీట్‌లో తన పేరును చేర్చటంపై ప్రభుత్వంతో పాటు పోలీసు శాఖపైనా ఆయన మండిపడ్డారు. తనపై కుట్రతోనే రౌడీషీట్ ఓపెన్ చేశారని ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్, హోం మంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.