హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ : ఫిబ్రవరి 7న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోలైన్ ప్రారంభం
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. 2020, ఫిబ్రవరి 7న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోలైన్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మెట్రోలైన్ ను ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. 2020, ఫిబ్రవరి 7న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోలైన్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మెట్రోలైన్ ను ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. 2020, ఫిబ్రవరి 7న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోలైన్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మెట్రోలైన్ ను ప్రారంభించనున్నారు. కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కిలోమీటర్ల మేర మెట్రో ప్రయాణం అందుబాటులోకి రానుంది. మొత్తం మూడు కారిడార్లు కలుపుకొని 68 కి.మీ మెట్రో కారిడార్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే కారిడార్-2 ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది.
జేబీఎస్-ఎంజీబీఎస్ మధ్య 9 స్టేషన్లు
ఈ రెండు స్టేషన్ల మధ్య 9 స్టేషన్లు నిర్మించారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వెళ్లడానికి కేవలం 16 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది. రెండు అతిపెద్ద బస్టాండులను లింక్ చేస్తూ నిర్మించిన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ నగర వాసులకే కాకుండా.. జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చే వారికి ఎంతో ఉపయోగపడనుంది. కాగా.. ఈ లైన్ నిర్మాణం, ట్రయల్ రన్ పూర్తి చేసుకుని మెట్రోరైలు భద్రతా శాఖ నుంచి 20 రోజుల క్రితమే అనుమతులు పొందిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఎల్ బీ నగర్-మియాపూర్, రాయదుర్గం-నాగోల్ మెట్రో లైన్లు
ఇప్పటికే ఎల్ బీ నగర్-మియాపూర్, రాయదుర్గం-నాగోల్ మెట్రో లైన్లు నడుస్తున్నాయి. మొదటగా హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు వున్న మెట్రో రైలు లైన్ ను ఇటీవలే నాగోల్ నుంచి రాయదుర్గం వరకు పొడిగించారు. నాగోల్ నుంచి రాయదుర్గం వరకు కారిడార్-3తోపాటు ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు కారిడార్-1 అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటికి సంబంధించిన 57 కిలోమీటర్ల రాకపోకలు సాగిస్తున్నాయి. తాజాగా.. మరో 11 కిలోమీటర్లు జోడించనున్నారు. దీంతో 68 కిలోమీటర్ల మెట్రో ప్రయాణం అందుబాటులోకి రానున్నది.
ఎంజీబీఎస్ వద్ద ఇంటర్‌చేంజ్ స్టేషన్
అమీర్ పేట్ తరహా అతిపెద్ద ఇంటర్‌చేంజ్ స్టేషన్ ఈ కారిడార్‌లో ఎంజీబీఎస్ వద్ద ఉంది. అయితే.. రెండో కారిడార్ జేబీఎస్ టూ ఫలక్‌నుమా వరకు మొత్తం 15 కి.మీ మార్గంలో… జేబీఎస్-ఎంజీబీఎస్ వరకు 11 కిలోమీటర్ల కారిడార్‌ను ఫిబ్రవరి 7న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మరింత మెట్రో మార్గం అందుబాటులోకి రానుండడంతో నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణం
ప్రతి రోజు వేల సంఖ్యలో మెట్రో రైలులో ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ సమ్మె కాలంలో బస్సులు లేకపోవడంతో నగరవాసులు మెట్రో రైలును ఆశ్రయించారు. అత్యధిక సంఖ్యలో మెట్రో రైలులో ప్రయాణించారు. ఆర్టీసీ సమ్మె కాలంలో లక్షల సంఖ్యలో ప్రజలు మెట్రో రైళ్లల్లో ప్రయాణించారు. ఒక్కరోజే లక్ష నుంచి రెండు లక్షలకు పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చి రికార్డు సృష్టించింది.