ఏప్రిల్ ఒకటి డెడ్ లైన్ : హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఉంటేనే బండి బయటకు

  • Published By: chvmurthy ,Published On : February 12, 2019 / 04:19 AM IST
ఏప్రిల్ ఒకటి డెడ్ లైన్ : హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఉంటేనే బండి బయటకు

హైదరాబాద్‌:  ఏప్రిల్ 1 నుంచి హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లు బిగించిన వాహనాలను మాత్రమే.. షోరూమ్ నుంచి డెలివరీ చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ప్రతి వాహనానికి సంబంధించిన సాంకేతిక వివరాలతోపాటు, యజమానుల వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకునేలా బయోమెట్రిక్‌ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని షోరూంలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్ల విషయంలోనూ ఇదే విధానం పాటించనున్నారు.

2012లోనే హైసెక్యూరిటీ ప్లేట్లను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నాణ్యత విషయంలో, ఇతర కారణాలతో సాధ్యం కాలేదు. దీంతో కొన్ని మార్పులు-చేర్పులతో నిబంధనలు మార్చారు. ఇక నుంచి వాహనం అమ్మకం జరిగే షోరూం నుంచే.. హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అమర్చే విధంగా రూల్స్ మార్చారు. 2019, ఏప్రిల్ 1 నుంచి షోరూంల్లో రిజిస్ట్రేషన్ అయ్యే బైకులు, కార్లు, ఇతర నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్లు అక్కడే బిగించి.. బయటకు పంపుతారు. 

2015, డిసెంబర్‌ నాటికి పాత, కొత్త వాహనాలకు వీటిని తప్పనిసరి చేసింది. అప్పటి నుంచి కేవలం కొత్త వాహనాలకు మాత్రమే వీటిని బిగించుకుంటున్నారు. పాత వాహనాలు పాత నెంబర్ ప్లేట్ల తోనే తిరుగుతున్నాయి. ఈ నంబర్‌ ప్లేట్లకు బైక్‌కు రూ.245, ఆటోకు రూ.400, కారుకు రూ.619 వసూలు చేస్తున్నారు. షోరూంలో వాహనం కొనుగోలు సమయంలోనే ఈ రుసుము చెల్లించాలి. నంబర్‌ప్లేట్‌ సిద్ధం కాగానే వాహనదారుడికి SMS వస్తుంది. అపుడు వెళ్లి దాన్ని బిగించుకోవాలి.

అమలులో  వైఫల్యం :
వాస్తవానికి హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లు నాసిరకంగా ఉన్నాయని వాహనదారులు అంటున్నారు. చిన్న పిల్లలు సైతం  వీటిని వంచడం లేదా పీకేయడం సులువుగా చేస్తున్నారు. దీంతో చాలా వరకు హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్లు ఆర్టీఏ కార్యాలయాల్లో మూలకు పడుతున్నాయి. ట్రాఫిక్‌ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు నంబర్‌ప్లేట్లను వంచడం, విరగ్గొట్టడం చేస్తున్నారు.  ఈ నంబర్‌ ప్లేట్‌ రెండోసారి బిగించుకోవాలంటే FIR తప్పనిసరి. ఈ తతంగమంతా ఎందుకులే అని వాహనదారులే..  కొత్త ప్లేట్‌ వేయించుకుంటున్నారు. హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌ లేకుండా తిరిగినప్పుడు ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు చలానా రాస్తారు. అయినా వాహనదారులు చలానాలు కడుతున్నారు తప్ప వీటిని బిగించుకోవడంపై ఆసక్తి చూపడం లేదని ఓ అధికారి తెలిపారు.