హైదరాబాద్‌లో ఇక నేరగాళ్లకు చుక్కలే, క్రైమ్ చేయాలంటే భయపడాలి.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం, విశేషాలు ఇవే

నేరస్తుల ఆటకట్టించడంలో పోలీసులు మరో ముందడుగు వేశారు. ఆధునిక టెక్నాలజీతో… కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా.. 5వేల కెమెరాల్లో రికార్డ్ అయ్యే విజువల్స్ ఏక కాలంలో చూడవచ్చు. సిటీలో ఏ మూలన చిన్న ఘటన జరిగినా వెంటనే అలర్ట్ కావచ్చు. గచ్చిబౌలిలో కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంటర్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
హైదరాబాద్‌లో క్రైమ్ చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది:
దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు ఐటీ మినిస్టర్ కేటీఆర్. హైదరాబాద్‌లో క్రైమ్ చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో తెలంగాణ పోలీస్ సక్సెస్ అయిందని కితాబిచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన పబ్లిక్ కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంచారు. ఈ సెంటర్ ద్వారా హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 5 వేల కెమెరాలను ఒకేసారి చూసేలా పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్, డేటా సెంటర్‌ను అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని అన్ని సీసీటీవీ కెమెరాలను లింక్ చేసి… ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. త్వరలోనే దీన్ని డయల్ హండ్రెడ్‌కు అనుసంధానం చేస్తారు.
దేశంలో ఉన్న మొత్తం సీసీ కెమెరాల్లో 65 శాతం హైదరాబాద్‌లోనే:
దేశంలో ఉన్న మొత్తం సీసీ కెమెరాల్లో 65 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయనే విషయాన్ని మంత్రి కేటీఆర్ చెప్పారు. నేరం చేసిన గంటల వ్యవధిలోనే నేరస్తులు దొరికిపోతారన్నారు. హైదరాబాద్ లో గత ఆరున్నరేళ్లుగా ఎంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొందని చెప్పారు.
హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని 5వేల సీసీ కెమెరాల దృశ్యాలను చూడొచ్చు:
సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే పబ్లిక్ కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక.. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏకకాలంలో పెద్ద స్క్రీన్‍పై ఐదువేల సీసీ కెమెరాలకు చెందిన దృశ్యాలను చేసే అవకాశం ఉంది. 10లక్షల కెమెరాలకు సంబంధించిన విజువల్స్‌ను నెల రోజుల పాటు స్టోర్ చేసేందుకుగాను భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 14 మీటర్ల పొడవు, 42 మీటర్ల ఎత్తుతో అర్ధ చంద్రాకారంలో భారీ స్క్రీన్.. దాని పక్కనే రెండు వైపులా 55 అంగుళాల సామర్థ్యం గల మరో నాలుగు టీవీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను ఇక్కడ నుంచి చూడవచ్చు.
హైదరాబాద్ పరిధిలో ఎమర్జెన్సీ అంబులెన్సులు ఆస్పత్రులకు వేగంగా వెళ్లేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్ చేయాలని మంత్రి కేటీఆర్ పోలీసులకు సూచించారు. మహిళల రక్షణ కోసం డ్రోన్ పోలీసింగ్ అమలు కోసం ఏవియేషన్ అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. ఇక బంజారాహిల్స్‌లో అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మరో రెండు నెలల్లో అందుబాటులోకి రాబోతోంది.