మోటారు వెహికల్ యాక్టు : మైనర్లకు వాహనం ఇస్తే భారీ జరిమాన!

మైనర్లకు..బండి ఇస్తున్నారా ? అయితే మీరు ఇబ్బందులో పడినట్లే. ఎందుకంటే భారీ జరిమాన విధించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ యాక్టును మైనర్లపై ప్రయోగించాలని యోచిస్తున్నారు. జరిమాన విధించడమే కాకుండా..జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ప్రయోగాత్మక అమలుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
నగరంలో మైనర్లు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలపై అతి వేగంగా దూసుకపోతున్న సంగతి తెలిసిందే. అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలకు కారణమౌతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈ క్రమంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటార్ వాహన చట్టాన్ని మైనర్లపై అమలు చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ధనవంతులు అధికంగా ఉండే జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో మొదటగా అమలు చేయాలని అనుకుంటున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే..వాహనం ఇచ్చిన తండ్రి లేదా సంబంధితుడికి రూ. 25వేల జరిమానా చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు.
జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సంబంధింత వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలను సస్పెండ్ చేస్తారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా వాహన ప్రమాదాల్లో వెయ్యి మంది దాక చనిపోతున్నారు. మైనర్ల నిర్లక్ష్య వాహన డ్రైవింగ్‌తో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వీరు చిక్కితే రూ. 5 వేల వరకు జరిమానాను వసూలు చేస్తున్నారు. జరిమాన తక్కువగా ఉండడ మూలంగా మొత్తాన్ని చెల్లించి..మళ్లీ తల్లిదండ్రుల దగ్గరి నుంచి వాహనం తీసుకుని రోడ్లపై రయ్యి రయ్యి మంటూ దూసుకెళుతున్నారు.
కొత్త మోటార్ వాహన చట్టంలో మైనర్ల డ్రైవింగ్‌ను అతిపెద్ద ఉల్లంఘనగా ఉంది. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో మైనర్లు డ్రైవింగ్ చేస్తూ హల్ చల్ చేస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత రేసులు పెడుతూ..తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. గత ఏడాది కాలంలో 500 మంది మైనర్లను పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు పోలీసులు తుది కసరత్తు జరుపుతున్నారు.
Read More : విభజన సమస్యలకు త్వరలో పరిష్కారం