కొత్త చలాన్ల ఎఫెక్ట్ : తెలంగాణలో మార్పు మొదలైంది
సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఫైన్లు భారీగా విధిస్తున్నారు. వేల రూపాయలు కట్టాల్సి వస్తోంది. సరైన పత్రాలు లేకుండా

సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఫైన్లు భారీగా విధిస్తున్నారు. వేల రూపాయలు కట్టాల్సి వస్తోంది. సరైన పత్రాలు లేకుండా
సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఫైన్లు భారీగా విధిస్తున్నారు. వేల రూపాయలు కట్టాల్సి వస్తోంది. సరైన పత్రాలు లేకుండా వాహనంతో రోడ్డెక్కితే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై పోలీసులు భారీగా ఫైన్లు వేస్తున్నారు. కొత్త మోటారు వాహనం చట్టం ఎఫెక్ట్ కనిపిస్తున్నట్టే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఈ చట్టం అమల్లోకి రాలేదు. కానీ అప్పుడే వాహనదారుల్లో మార్పు మొదలైంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూసి వాహనదారులు అలర్ట్ అవుతున్నారు. ముందు జాగ్రత్త పడుతున్నారు. పత్రాలను సరి చూసుకుంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేట్, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటున్నారు. ఒక వేళ లేకపోతే సరి చేసుకుంటున్నారు.
గతంలో ట్రాఫిక్ పోలీసులు బండి ఆపితే ఎవరో ఒకరితో ఫోన్ చేయించడమో.. ఏదో ఒకటి చెప్పి వెళ్లడమో జరిగేది. కొత్త చట్టం అమల్లోకి వస్తే పోలీసులు కఠినంగా వ్యవహరించడంతోపాటు జేబు గుల్ల అయ్యే ప్రమాదం ఉండటంతో వాహనదారులు రిస్క్ తీసుకోవడం లేదు. జాగ్రత్త పడుతున్నారు.
మోటారు వాహనాల చట్టం-1988కు సవరణల్ని కేంద్రం ఆమోదించింది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఇంకా ఆమోదముద్ర పడకపోయినా వాహనదారులు అలర్ట్ అవుతున్నారు. భారీ జరిమానాలు చూసి ముందు జాగ్రత్త పడుతున్నారు. గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా జరిమానాలు రూ.100 వరకే ఉండేవి. సర్వీస్ చార్జ్ రూ.35 కలుపుకొని రూ.135 కడితే సరిపోయేది. అదే సైబరాబాద్ రాచకొండల్లో సాధారణంగా రూ.1435 వరకు గరిష్ఠంగా జరిమానాలు విధించేవారు. తాజా సవరణలతో ఫైన్లు రూ.5వేల వరకు విధించే అవకాశం కనిపిస్తోంది. గరిష్ఠంగా రూ.25 వేల వరకు బాదే ప్రమాదం ఉండటం ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అంశంగా మారింది. దీనికితోడు కొన్ని ఉల్లంఘనల్లో డ్రైవింగ్ లైసెన్స్ ను 3 నెలల పాటు రద్దు చేసే ఛాన్స్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మైనర్లకు వాహనాలిచ్చిన యజమానికి గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష పడనుండటం వాహనదారుల్ని వణికిస్తోంది.
* డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే మోటారు వాహనాల చట్టంలోని 181 సెక్షన్ ప్రకారం గతంలో రూ.500 జరిమానా ఉండేది. తాజా సవరణలతో అది రూ.5 వేలు విధించే అవకాశముంది.
* ఇన్సూరెన్స్ చేయించని వాహనాన్ని నడుపుతూ దొరికితే 196 సెక్షన్ ప్రకారం గతంలో రూ.1,000 జరిమానా విధించేవారు. భవిష్యత్తులో రూ.2వేల వరకు విధించొచ్చు.
* చట్టంలోని 206 సెక్షన్ ప్రకారం పోలీసు అధికారులు అవసరమైతే వాహన పత్రాల్ని స్వాధీనపరుచుకునే అధికారముంది. గతంలో ఈ నిబంధనను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇకపై పత్రాల విషయంలో అనుమానముంటే ఈ నిబంధనపై గట్టిగా దృష్టి సారించే అవకాశముంది. ఉల్లంఘననుబట్టి అవసరమైతే 183, 184, 185, 189, 190, 194సి, 194డి, 194ఇ సెక్షన్ల ప్రకారం పత్రాల్ని జప్తు చేసి డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేయొచ్చు.
వాహన పత్రాలంటే సాధారణంగానే రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ గుర్తుకొస్తాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే చాలావరకు షోరూం వారే రిజిస్ట్రేషన్ తోపాటు ఇన్సూరెన్స్ చేయించడం కామన్. ఇన్సూరెన్స్ డేట్ అయిపోయినా రెన్వుల్ విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఇన్సూరెన్స్ రెన్వుల్ చేయకపోతే వాహనదారుడు ప్రమాదానికి గురైతే జరిగే ఆర్థిక, ప్రాణనష్టం ఖాయం. వాహన బీమా విషయంలో ట్రాఫిక్ పోలీసులు కీలక దృష్టి సారించే అవకాశాలుండటం వాహనదారుల్ని ఆలోచనలో పడేస్తోంది. వాహన బీమా రెన్వుల్ లో నిమగ్నమయ్యారు. దీంతో పెట్రోల్ బంక్ ల్లోని కియోస్క్ ల దగ్గర బారులు తీరారు. మొత్తంగా కొత్త మోటారు వాహన చట్టం పుణ్యమా అని వాహనదారుల్లో మార్పు కనిపించడం పట్ల ట్రాఫిక్ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అంటున్నారు.