గుండెలు అదురుతున్నాయి : బంగారం ధర కాదు.. బస్ టికెట్ రేట్లే

  • Published By: vamsi ,Published On : October 4, 2019 / 08:02 AM IST
గుండెలు అదురుతున్నాయి : బంగారం ధర కాదు.. బస్ టికెట్ రేట్లే

Updated On : October 4, 2019 / 8:02 AM IST

ఎవరికైనా పండుగ వస్తే సంతోషంగా ఉంటుంది. అయితే బస్సు టిక్కెట్ల రేట్లు మాత్రం సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రేట్లకు అంతూపొంతూ లేకుండా పోయింది. రద్దీతోపాటు తెలంగాణ ఆర్టీసీ సమ్మె ప్రకటనతో ఒక్కసారిగా టికెట్లు పెరిగిపోయాయి. డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు అదనపు బస్సుల పేరుతో అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి ట్రావెల్ ఏజెన్సీలు. విమాన ఛార్జీలతో పోటీపడుతున్నాయి. పండుగకు ఊరికి వెళ్లేవాళ్లకు హైదరాబాద్ నగరంలోనే జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ఆర్టీసీ సైతం పండుగ రద్దీ పేరుతో టికెట్‌ పై 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది.

హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాలంటే ప్రైవేట్ బస్సుల్లో ఏసీ ఛార్జీ అత్యధికంగా రూ.3వేల వరకు ఉంది. ఓ ఫ్యామిలీ వెళ్లాలంటే 10వేల రూపాయలపైనే ఖర్చవుతుంది. ఇక పండగ తర్వాత తిరుగు ప్రయాణంలో విశాఖ నుంచి హైదరాబాద్ కు కూడా ఇవే రేట్లు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ – విశాఖ – హైదరాబాద్ ఓ ఫ్యామిలీ వెళ్లి రావాలంటే ఛార్జీలకే 20వేల రూపాయలు అవుతుంది అంటే ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లు ఎలా ఉన్నాయో అర్థం అవుతుంది. ఇక నెల్లూరుకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు భారీగా ఉన్నాయి. హైదరాబాద్ – నెల్లూరుకు ఏసీ బస్సులో కనీస ధర రూ.1,600 గా ఉంది. మంచి బస్ సర్వీస్ అయితే అది 2వేల రూపాయల వరకు ఉంది. ఈ టికెట్ రేట్లు చూసి షాక్ అవుతున్నారు ప్రయాణికులు. బంగారం ధర కాదు బస్ టికెట్ రేట్లే అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

ఎక్కువ డిమాండ్‌ ఉన్న రూట్లు.. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరులకు మాములుగా బస్‌ టికెట్‌ 500 వరకూ ఉంటే.. దసరా పేరు చెప్పి 2వేల 500 వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ లో నాన్ ఏసీ టికెట్ ధర కూడా కనీసం వెయ్యి రూపాయలుగా ఉంది. దీంతో సామాన్య ప్రయాణికులు భయపడిపోతున్నారు. ఏసీ సర్వీసులు అయితే 2వేల రూపాయల వరకు ఉన్నాయి.