సంక్రాంతి వేడుకలు : ఏ రాష్ట్రంలో ఏ విధంగా జరుపుకుంటారు..

సంక్రాంతి కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన పండగ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా జరుపుకొనే విశిష్టమైన పండుగ.

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 05:42 AM IST
సంక్రాంతి వేడుకలు : ఏ రాష్ట్రంలో ఏ విధంగా జరుపుకుంటారు..

Updated On : January 14, 2020 / 5:42 AM IST

సంక్రాంతి కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన పండగ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా జరుపుకొనే విశిష్టమైన పండుగ.

సంక్రాంతి కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన పండగ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా జరుపుకొనే విశిష్టమైన పండుగ. దేశమంతటా ఈ పర్వదినానికి ప్రాముఖ్యమున్నా, ఆచరించే పద్ధతుల్లో మాత్రం భిన్నత్వం కనిపిస్తుంది. సంక్రాంతి పర్వదినాన్ని ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ విధంగా జరుపుకుంటారో చూద్దాం…తమిళనాడులో సంక్రాంతి పండుగను పొంగల్ అంటారు. ఇక్కడ కూడా నాలుగు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.

కొత్త పంటలతో పండిన బియ్యం, బెల్లంతో పాలుచేర్చి పొంగలి వండి దేవుడికి నైవేద్యంగా పెట్టి, ఇంటిల్లిపాదికి అందించి సంతోషంతో పండగను ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. ఈ రోజున భక్తులందరు ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలతో వృద్ది చెందాలని ఆ సూర్యభగవానుడిని ప్రార్థిస్తారు.  భోగి రోజున కొత్త బియ్యంతో పాయసం చేసి, పిత్రాది దేవతలకు నైవేద్యం పెడతారు. మరుసటి రోజు జరిగే సూర్య పొంగల్  రోజున పశువులను ఆరాధిస్తారు. సంక్రాంతి సందర్భంగా జల్లికట్టు నిర్వహించడం తమిళనాడులో సంప్రదాయం. 

కర్ణాటకలో కూడా సంక్రాంతి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా మకర సంక్రాంతి వేళ కృష్ణుడు కొలువైన ఉడిపి క్షేత్రం కోలాహలంగా ఉంటుంది. మకర సంక్రాంతి ఉత్తరాయన ప్రవేశం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు చేస్తారు. సంక్రాంతి రోజున రథాల్లో నిర్వహించే శోభయాత్ర చాలా ఉత్సహాభరితంగా సాగుతుంది. కర్ణాటక గ్రామాల్లో సంక్రాంతి సందర్శంగా నిర్వహించే కంబాల పోటిలు చూడాల్సిందే. కర్ణాటకలో నవ్వులు, బెల్లం, కొబ్బరి, శెనగపప్పుతో తయారుచేసి ప్రసాదాన్ని దానంగా ఇస్తారు, అలాగే చెరకు గడను కూడా పంచడం ఇక్కడి ఆచారం. ఎల్లుబెల్ల పేరుతో నువ్వులు బెల్లం వంట‌కాల‌ను తింటారు. ఒక‌రి కొక‌రు పంచుకుంటారు.

కేరళలో ‘మకర విళక్కు’ పేరుతో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇదే రోజు శబరిమలైలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి దూరప్రాంతాల నుండి కూడా చాలామంది వస్తుంటారు. ఒరిస్సాలో కూడా కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతిని జరుపుకుంటారు. రంగోళీలు వేసి, దైవపూజలు చేస్తారు. బెల్లంతో చేసిన పరమాన్నం వండి పేదలకు పంచిపెడతారు. గుజరాత్ లో మకర సంక్రాంతి నాడు నువ్వులతో చేసిన మిఠాయిలు పంచిపెడతారు. సంక్రాంతి సందర్భంగా  ఇంటి పెద్దలు, ఇంట్లో చిన్నవాళ్లకు బహుమతులు  కానుకలిచ్చే సంప్రదాయం ఇక్కడ ఉంది. గుజరాత్‌లో గాలిపటాల పోటీలు చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తారు. 

మహారాష్ట్రలో సంక్రాంతి పండగ సందర్భంగా తీల్‌గూడ్ పేరిట నువ్వులు, బెల్లంతో హల్వా చేసి బంధుమిత్రులకు పంచడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే కొత్తగా పెళ్లైన మగువలకు ‘హల్దీ కుంకుమ్’ పేరుతో పసుపు, కుంకుమలతో పాటు, తాంబూలాలు అందించి వస్తువులను కూడా బహుకరిస్తారు. మకర సంక్రాంతి రోజు నల్లరంగు దుస్తులు ధరిస్తారు. చలికాలంలో శరీరం వెచ్చగా ఉండి, అనారోగ్యంపాలు కాకుండా కాపాడుకోవడానికి నువ్వుల లడ్డూలు, భక్ష్యాలు వండుతారు.  నువ్వులు, చెరకు ఒకరికొకరు దానం చేసుకోవడం ఇక్కడ ఆచరణలో ఉంది.

రాజస్థాన్‌లో సంక్రాంతి రోజున ఘెవార్‌, తిల్‌ప‌ట్టీ, ఘ‌జ‌క్‌, ఖీర్, దాల్‌ పకోడీ అనే స్వీట్లు చేసుకుంటారు. ఇక్కడ’స‌క్రాత్ భోజ్‌’ కు ప్రాధాన‌్యతనిస్తారు.  బంధువుల‌ను, స్నేహితుల‌ను విందు భోజ‌నానికి ఆహ్వానించ‌డం. జైపూర్, జోధ్‌పూర్‌లో బ్రైట్ అండ్ కలర్ ఫుల్ రంగులతో అద్భుతమైన డిజైన్లతో పతంగులు సంబరాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. పశ్చిమ బెంగాల్లో సంక్రాంతి రోజున ప్రత్యేకంగా గంగా సాగర్ ఉత్సవం నిర్వహించబడుతుంది. పంటలు బాగా పండినందుకుగాను సూర్యదేవునికి కృతజ్ఞతలు చెప్పటానికి వివిధ నగరాల నుండి వేలాది మంది భక్తులు ఈ ప్రదేశానికి వస్తుంటారు.  మకర సంక్రమణ వేళ పుణ్యస్నానాలు చేయడం ఆచారంగా వస్తోంది.

పంజాబ్‌లో సంక్రాంతి రోజున గోపాల వ్రతం  చేస్తారు. సంక్రాంతికి ముందు “లోహ్రీ” అనే ప్రత్యేక ఉత్సవం జరుపుతారు. తెలుగువాళ్లకి భోగి పండుగ ఎలాగో… పంజాబ్‌లో లోహ్రీకి అంతే ప్రాధాన్యం ఉంది. ఆ  రోజు ఆరుబయట మంటలు వేసి ఇష్టదైవాలను ఆరాధిస్తారు. మకర సంక్రాంతిని పంజాబ్‌లో “మాఘీ” అంటారు. యూపీలో సంక్రాంతిని “కిచెరి” అనే పేరుతో పిలుస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు పవిత్ర గంగానదిలో కర్మస్నానం చేస్తారు.

అలహాబాద్‌లో మాఘ మేళ వంటి భోగి మంట వేస్తారు.  పేదవారికి నువ్వులు, చెరకు , కిచిడి వంటి తినుబండాలను దానం చేయడం ఆనవాయితీ. మధ్యప్రదేశ్ లో సంక్రాంతిని సుకరాత్ పేరుతో జరుపుకుంటారు. గోవులను పూజిస్తూ.. కొత్త పంటలను ఇంటికి తీసుకొని వస్తారు. ఇలా భారతావనిలో ప్రధానప్రాంతాల్లో సంక్రాంతి ప్రజల ఇళ్లలో కొత్త కాంతిని తీసుకువస్తుంది.