కొలువుదీరిన కొత్త సర్పంచులు
సర్పంచుల ప్రమాణ స్వీకారాలతో తెలంగాణ పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది.

సర్పంచుల ప్రమాణ స్వీకారాలతో తెలంగాణ పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా కొత్త సర్పంచులు కొలువు తీరారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లతో ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి సర్పంచులుగా గెలుపొందడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నూతన సర్పంచులందరికీ సోమవారం నుంచి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
సర్పంచుల ప్రమాణ స్వీకారాలతో తెలంగాణ పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు ఆయా గ్రామాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు మెంబర్లచే ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణోత్సవ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 538 మంది సర్పంచులు, 6 వేల 128 మంది వార్డు మెంబర్లు ప్రమాణస్వీకారం చేశారు. తమపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన నూతన సర్పంచులు…గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. మరోవైపు తమ పదవులను సైతం కీలకం చేయడంతో ఉపసర్పంచులు సంతోషం వ్యక్తం చేశారు. తొలిసారిగా గ్రామపంచాయతీలుగా మారిన తండాల్లో సందడి నెలకొంది. తండాలకు సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించినవారు ఆనందంతో పొంగిపోయారు
అటు పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జురు మండలంలోని కుకుడ గ్రామ సర్పంచ్‌గా ఆసియా భాను ప్రమాణస్వీకారాన్ని ప్రత్యర్థి వర్గం అడ్డుకుంది. అధికారుల తప్పిదంతో ఏకగీవ్రంగా ఎన్నికైందంటూ ఆందోళనకు దిగారు. సర్పంచ్ ఎన్నిక చెల్లదంటూ పంచాయతీ సెక్రటరీ బాబూరావును మహిళలు చితకబాదారు.
సూర్యాపేట జిల్లా కోదాడలోనూ ఉద్రిక్త వాతారణం నెలకొంది. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ప్రమాణ స్వీకరాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు..అటు టీఆర్ఎస్ అభ్యర్థి ఆత్మహత్యకు యత్నించాడు. ఇరువురికి సమాన ఓట్లు రావడంతో టాస్ వేసి విజేతను ప్రకటిస్తామన్నారని…కానీ టాస్ లేకుండానే కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థితో ప్రమాణం చేయిస్తున్నారని ఆందోళనకు దిగారు.
ఇక కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సోమవారం నుంచి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో….కొత్త పంచాయతీరాజ్ చట్టం సహా వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు సర్పంచులుగా గెలుపొందిన వారందరికీ సీఎస్ ఎస్‌కే జోషి శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక తెలంగాణకు కొత్త నాయకత్వం లభించిందని…గ్రామ సభలను పటిష్ట పరచాలని సర్పంచులకు సూచించారు.