వారికే అవకాశం : తెలంగాణ కేబినెట్ విస్తరణ

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ విస్తరణ 2019, ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో జరిగే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణలో అనుభవానికే పెద్దపీట వేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశముంది. మొదటిసారి విజయం సాధించిన వారిలో ఒకరిద్దరికి మాత్రమే అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ జాబితాపై కేసీఆర్ ఆదివారం కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. జిల్లాల వారీగా సామాజివర్గాలు, ఇతర వివరాలను పరిశీలించినట్టు సమాచారం. రెండు నుంచి ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, అందులో విధేయులైన వారి పేర్లు మొదటి వరుసలో ఉన్నట్లు తెలిసింది. విధేయత, నడవడిక, పార్టీ, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా పనిచేయడం వంటివి ప్రధానార్హతలు మంత్రివర్గ విస్తరణలో కీలకంకానున్నాయి.