తెలంగాణ హైకోర్టుకు 100 ఏళ్లు

ఇండో-ఇస్లామిక్ సంప్రదాయానికి నిలువుటద్దం.. భాగ్యనగర ఘనచరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యం… చూడటానికి అదో రాతికట్టడం.. కానీ తెలంగాణ వైభవాన్నిఎలుగెత్తిన చాటిన కీర్తి పతాకం. కోట్లాదిమందికి న్యాయాన్ని ప్రసాదించిన దేవాలయం. అదే నేటి తెలంగాణ హైకోర్టు భవనం. ఏప్రిల్ 20వ తేదీకి 100 ఏళ్లను పూర్తి చేసుకుని… శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది.
మూసీనది ఒడ్డున నిర్మించిన ఈ భవనాన్ని 1920 ఏప్రిల్ 20న ప్రారంభించారు. ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్.. 1915లో ఈ భవన నిర్మాణాన్ని ప్రారంభించి.. 1920 ఏప్రిల్ 20 నాటికి పూర్తి చేశారు. జైపూర్ కు చెందిన ఇంజినీర్, ఆర్కిటెక్ట్ శంకర్ లాల్ ఈ భవనం నమూనాను తయారు చేశారు. హైదరాబాద్ కు చెందిన ఇంజినీర్ మెహర్ అలీ ఫజల్ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. అప్పట్లోనే 18 లక్షల 22 వేల రూపాయల అంచనా వ్యయంతో మొదలైన ఈ భవన నిర్మాణ కాంట్రాక్ట్ ను నవరతన్ దాస్ దక్కించుకున్నారు. ఇండో ఇస్లామిక్ సాంప్రదాయ రీతిలో దీనిని నిర్మించారు.
నిజాం కాలంలో రాయల్ చార్టర్ కింద కొనసాగిన న్యాయస్థానంలో.. 1928లో హైకోర్టు యాక్ట్ కింద బెంచ్ లు ఏర్పాటు చేసి కేసుల విచారణ ప్రారంభించారు. స్వాతంత్య్రం అనంతరం హైదరాబాద్ విలీనం తరువాత హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో కొనసాగింది. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా అవతరించింది. 1956 నవంబర్ 5న 11 మంది న్యాయమూర్తులతో ఉమ్మడి హైకోర్టు విధులను ప్రారంభించింది. హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు పనిచేసారు. 1958లో మరో రెండు బ్లాక్‌లు నిర్మించారు. 1976లో ఇంకో బ్లాక్ ఏర్పాటైంది. 1998లో బహుళ అంతస్థుల పరిపాలనా భవనాన్ని నిర్మించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా నాలుగున్నరేళ్లు ఉమ్మడి హైకోర్ట్‌గా కొనసాగింది. 2019 ఏపీ హైకోర్టు ప్రారంభం కావడంతో ఉమ్మడి హైకోర్టుగా ఉన్న ఈ భవనం తెలంగాణ హైకోర్టుగా మారింది.
రాష్ట్ర హైకోర్టు భవనానికి వందేళ్లు పూర్తి కావడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇది తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవమని చెబుతున్నారు. హైకోర్టు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ కౌన్సిల్ ప్రతినిధులు హాజరుకానున్నారు. వందేళ్లు పూర్తవుతున్నా ఇంకా చెక్కు చెదరకుండా ఉన్న ఈ భవనం…నిజాం కాలంలోని అద్భుత నిర్మాణమంటూ అందరూ కొనియాడుతున్నారు. భవిష్యత్తుల్లో తెలంగాణ కీర్తిని మరింత వ్యాప్తిచేయడం ఖాయమని భావిస్తున్నారు.