తల్లీ శాంతించు : మమ్మల్నిముంచేయకు అంటూ మూసీనది మంత్రుల పూజలు

Hyderabad Musi River floods..హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న మూసీ నది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహోగ్రరూపం దాల్చింది. వరదనీటితో నగరంపై విరుచుకుపడింది. అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లన్నీ నదుల్ని తలపించాయి.
ఇటీవల కురిసిన అత్యంత భారీ స్థాయిలో కురిసిన వర్షాలకు మూసీ నది వరదనీటితో పోటెత్తింది. దాంతో నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతం వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో మూసీ నది తల్లీ శాంతించు..మమ్మల్ని ముంచేయకు అని ప్రార్థిస్తూ మూసీనదికి తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పురానాపూల్ వద్ద మూసీ నదికి శాంతి పూజలు చేశారు.
https://10tv.in/heavy-rains-effect-200-transformers-gone-in-musi-river-flood-water/
గంగమ్మ తల్లికి బోనం సమర్పించడంతో పాటు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు నివేదించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, 1908లోనూ భారీ వరదలు సంభవించడంతో నాటి నిజాం పాలకుడు మీర్ మహబూబ్ అలీఖాన్ కూడా మూసీ నదికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మూసీ నదికి అంతటిస్థాయిలో భారీ వరదలు రావడం మళ్లీ ఇదే ప్రథమం.
హైదరాబాద్ లో 2020 అక్టోబర్12, 13, 14 తేదీల్లో కురిసిన వర్షం చరిత్రలో నిలిచిపోతుంది. 1908 వరదల తర్వాత 2000, ఆ తర్వాత 2006, 2016లో భారీ వరదలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన వరదలు వాటన్నింటినీ మించిపోయాయి. మొట్టమొదటిసారి హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వరద ప్రభావం కనిపించింది. ముఖ్యంగా పాతబస్తీలో పాత డ్రైనేజీ వ్యవస్థ బాగానే ఉన్నా, పెరిగిన జనాభాకు, ఇప్పటి వర్షాలకు తగిన సామర్థ్యం లేక అక్కడ నీటి ప్రవాహం పెరిగి, తీవ్ర నష్టాలకు కారణమైంది.
ఈ ఏడాది వర్షాకాలంలో పడిన వర్షాలకు చెరువులన్నీ నిండాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నుంచి నీటిని ఇటీవల కాలంలో రెండు, మూడుసార్లు రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈక్రమంలో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది తన మహోగ్రరూపం దాల్చి ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టింది. దీంతోతెలంగాణ ప్రభుత్వం మంత్రులు మూసీని శాంతించాలంటూ పూజలు చేశారు.