కొండావిశ్వేశ్వర రెడ్డిపై ఈసీ కి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్న విశ్వేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. టీఆర్ఎస్ నేతలు దండే విఠల్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ఈసీకి ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.
గచ్చిబౌలీలో పోలీసుల తనిఖీల్లో భాగంగా విశ్వేశ్వరెడ్డి అడ్వకేట్ సందీప్ రెడ్డి వద్ద 10 లక్షల రూపాయలు బుధవారం పోలీసులకు దొరికాయని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. అతడ్ని సోదా చేయగా లభించిన కాగితాల్లోని సమాచారాన్నిబట్టి.. చేవెళ్ల అసెంబ్లీకి రూ.10 కోట్లు, చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి రూ.70 కోట్లు ఖర్చు పెట్టాలని రాసిన కాగితాలు కూడా దొరికాయని టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో పలుమార్లు ప్రసారం అయ్యాయని వారు పేర్కొన్నారు. అయితే ఆ డబ్బు తనది కాదని ఈసీకి విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు చేయడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని టీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. విశ్వేశ్వర రెడ్డి పై పూర్తి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు.