ముగ్గురు సిట్టింగ్‌లకు నో ఛాన్స్ : టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే

హైదరాబాద్: అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. ఊహించినట్టుగానే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి రెండోసారి టికెట్ ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించలేదని ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఖమ్మం(పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి), మహబూబ్ నగర్(జితేందర్ రెడ్డి), మహబూబాబాద్(సీతారాం నాయక్) సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఇవ్వలేదు. లోక్ సభ బరిలో నలుగురు కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. ఏడుగురు సిట్టింగ్ లకు మరో ఛాన్స్ ఇచ్చారు. మొత్తం 17 లోక్ సభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
పెద్దపల్లి అభ్యర్థిపై ఉత్కంఠ నడిచింది. వివేక్, వెంకటేశ్ నేతకాని మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరికి వెంకటేశ్ నేతకాని టికెట్ దక్కించుకున్నారు. గురువారం(మార్చి 21, 2019) వెంకటేశ్ నేతకాని కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటేశ్ నేతకాని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఎంఐఎం మిత్రపక్షం కావడంతో హైదరాబాద్ నుంచి టీఆర్ఎస్ పోటీ చేయదని అంతా భావించారు. ఎంఐఎంకు మద్దతివ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అనూహ్యంగా హైదరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడం విశేషం. పుస్తె శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఇది వ్యూహంలో భాగమే అని తెలుస్తోంది. అభ్యర్థిని బరిలోకి దింపి పరోక్షంగా ఎంఐఎంకి సహకరించే అవకాశం ఉందని, హిందువుల ఓట్లు చీల్చేందుకే టీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
* ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు నో ఛాన్స్
* ఏడుగురు సిట్టింగ్ ఎంపీలకు మరో అవకాశం
టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు:
* కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్
* మెదక్ – కొత్త ప్రభాకర్ రెడ్డి
* నిజామాబాద్ – కల్వకుంట్ల కవిత
* జహీరాబాద్ – బీబీ పాటిల్
* ఆదిలాబాద్ – నగేష్
* వరంగల్ – పసునూరి దయాకర్
* భువనగిరి – బూర నర్సయ్యగౌడ్
* నల్లగొండ – వేమిరెడ్డి నర్సింహారెడ్డి
* పెద్దపల్లి – వెంకటేశ్ నేతకాని
* ఖమ్మం – నామా నాగేశ్వరరావు (మాజీ ఎంపీ)
* నాగర్‌కర్నూలు – రాములు (మాజీ మంత్రి)
* మహబూబాబాద్ – మాలోత్ కవిత (మాజీ ఎమ్మెల్యే)
* హైదరాబాద్ – పుస్తె శ్రీకాంత్ రెడ్డి
తొలిసారి లోక్ సభ బరిలోకి 4 కొత్త ముఖాలు:
* సికింద్రాబాద్ – తలసాని సాయికిరణ్ యాదవ్ (తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు)
* మహబూబ్ నగర్ – ఎం. శ్రీనివాస్ రెడ్డి
* మల్కాజ్ గిరి – రాజశేఖర్ రెడ్డి (మల్కాజ్ గిరి మాజీ ఎంపీ, మంత్రి మల్లారెడ్డి అల్లుడు)
* చేవెళ్ల – డా. రంజిత్ రెడ్డి
నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఈసారి పోటీ చేయడంపై విముఖత చూపారు. లోక్ సభ బరిలో ఉండను అని కేసీఆర్ కు ఆయన స్పష్టం చేశారు. ఆయన విజ్ఞప్తికి కేసీఆర్ ఆమోదం తెలిపారు. గుత్తా స్థానంలో వేమిరెడ్డి నర్సింహారెడ్డికి టికెట్ కేటాయించారు.