విషమించిన కిమ్ ఆరోగ్యం : ఉత్తరకొరియాకు వైద్య నిపుణుల టీమ్ ను పంపిన చైనా

ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయి. కరోనా కట్టడి కోసం దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా తప్ప మరో వార్త ఎక్కడా వినిపించడం లేదు. అయితే కరోనా కట్టడి విషయంలో మాత్రం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(36)వార్తల్లో నిలబడుతున్నాడు. ఉత్తరకొరియాలో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా లేదన్నది బయటి ప్రపంచానికి అందిన సమాచారం. కరోనా కట్టడి విషయంలో కిమ్ చర్యలు భేష్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తను కిమ్ పై పొగడ్తల వర్షం కురిసింది. అయితే ఇప్పుడు కరోనా విషయం పక్కకుబెడితే…అసలు కిమ్ బతికే ఉన్నాడా అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
27ఏళ్లకే ఉత్తరకొరియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై వారం రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గుండె సంబంధిత వ్యాధితో కిమ్ బాధపడుతున్నారని,కిమ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కిమ్ కు హార్ట్ సర్జరీ కూడా నిర్వహించారని, దాని తరువాత కిమ్ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపించాయి. ఈ సమయంలో చైనా నుంచి వచ్చిన ఓ వార్త ఇప్పుడు.. కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తలకు బలం చూకూరుస్తుంది. కిమ్ ఆరోగ్యంపై చర్చ సమయంలో వైద్య నిపుణులతో సహా ఓ అధికారిక టీమ్ ను ఉత్తరకొరియాకు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఇప్పుడు కిమ్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినట్లు వస్తున్నవార్తలకు ఇది బలం చేకూరుస్తుంది.
ఉత్తరకొరియా అధినేత ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు పొరుగుదేశమైన చైనా నుంచి..డాక్టర్లు,వైద్యనిపుణులు,అధికారులతో కూడిన ఓ బృందం ఉత్తరకొరియాకు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వైద్య బృందం హడావుడిగా ఉత్తరకొరియాకు వెళ్లడంపై కిమ్ ఆరోగ్యంపై మళ్లీ నీలినీడలు అలుముకున్నాయి. అయితే ఉత్తరకొరియాకు ఎవరు వెళ్లారనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. కాగా, కిమ్ తండ్రి… కిమ్ జాంగ్ ఇల్‌కు కూడా 2008లో గుండెపోటు వచ్చినప్పుడు కూడా చైనా నుంచి ఫ్రాన్స్ నుంచి డాక్టర్లు ఉత్తరకొరియాకు వెళ్లి ఆయనకు చికిత్స చేసినట్లు సమాచారం.
అయితే, కిమ్ ఆరోగ్యం విషమంగా లేదని ఏప్రిల్-21న దక్షిణకొరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజం కాదని ఇద్దరు దక్షిణ కొరియా ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. కిమ్ ఆరోగ్యం గురించి ఉత్తరకొరియా నుంచి ఎటువంటి అసాధారణ సంకేతాలు లేవని దక్షిణకొరియా తెలిపింది. ఏప్రిల్-12 తర్వాత హృదయ సంబంధిత ఆపరేషన్ తర్వాత మౌంట్ కుమాంగ్ రిసార్ట్ లోని ఓ విల్లాలో కిమ్ ఉన్నారని,ఆయన కోలుకుంటున్నారని సియోల్ ప్రధానకేంద్రంగా పనిచేసే ఓ స్పెషాలిటీ వెబ్ సైట్ డైలీ NK తెలిపింది. కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని అయితే విషమంగా ఉందన్న వార్తల్లో నిజంలేదని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా స్పష్టం చేశాయి. కిమ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేదని, అయితే పరిస్థితిని మాత్రం సమీక్షిస్తున్నట్లు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపే చెప్పారు.
కాగా, ఏప్రిల్-15న ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే ముఖ్యమైన తన తాత,ఉత్తర కొరియా జాతిపిత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ హాజరుకాకపోవడంతో ఆయన ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏటా దేశంలో పండుగలా జరిపే తన తాత జయంతి ఉత్సవాలకు తప్పనిసరిగా హాజరయ్యే కిమ్… ఈ సారి మాత్రం గైర్హాజరయ్యాడు. 2014లో కూడా ఇలానే కనిపించకుండా పోయిన కిమ్ ఆ తర్వాత ఒక నెలకు కుంటుతూ కనిపించాడు. అయితే ఏప్రిల్-12న కిమ్ జోంగ్ ఉన్ ఓ ఎయిర్ బేస్ ను సందర్శించారని,ఫైటర్ జెట్ లు మరియు ఎటాక్ ఎయిర్ క్రాఫ్ట్ డ్రిల్స్ ను ఆయన వీక్షించారని ఉత్తరకొరియా మీడియా ఏప్రిల్-12న రిపోర్ట్ చేసిన విసయం తెలిసిందే. అయితే అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఉత్తర కొరియా నుంచి ఎలాంటి ప్రకటనా ఇప్పటివరకు వెలువడలేదు.