రైలులో ప్రయాణికులను పొడుచుకుంటూ వెళ్లిన ఉగ్రవాదులు.. వణికిపోతూ వాష్‌రూమ్‌లలో దాక్కున్న ప్యాసింజర్స్‌

ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ మంత్రి షబానా మహ్మూద్‌ ధ్రువీకరించారు.

రైలులో ప్రయాణికులను పొడుచుకుంటూ వెళ్లిన ఉగ్రవాదులు.. వణికిపోతూ వాష్‌రూమ్‌లలో దాక్కున్న ప్యాసింజర్స్‌

Updated On : November 2, 2025 / 2:51 PM IST

UK News: యూకేలో ఉగ్రవాదులు కలకలం రేపారు. లండన్‌ వైపు వెళ్తున్న రైలులో ప్రయాణికులపై కత్తితో దాడులు చేశారు. 10 మంది ఆసుపత్రిలో చేరగా, వారిలో 9 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.

హంటింగ్డన్‌ పట్టణంలోని రైల్వే స్టేషన్‌ సిబ్బందికి ఈ దాడి గురించి సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. అంబులెన్స్‌లు కూడా భారీగా అక్కడికి చేరుకున్నాయి. (UK News)

“కేంబ్రిడ్జ్‌షైర్‌లో రైలులో జరిగిన కత్తిపోటు ఘటనలో 10 మందిని ఆసుపత్రికి తరలించాం. వారిలో 9 మందికి ప్రాణాపాయం ఉన్నట్లు భావిస్తున్నాం” అని బ్రిటిష్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పోలీస్‌ ఎక్స్‌లో తెలిపింది. తాము చేస్తున్న ఈ దర్యాప్తునకు కౌంటర్‌ టెరరిజం యూనిట్లు (ఉగ్రవాద వ్యతిరేక దళాలు) సహకరిస్తున్నాయని పేర్కొంది.

ఈ రైలు డాన్‌కాస్టర్‌ నుంచి లండన్‌ కింగ్స్‌క్రాస్‌ స్టేషన్‌ వైపు వెళ్తున్న సమయంలో ఈ దాడులు జరిగాయని ట్రాన్స్‌పోర్ట్‌ పోలీసులు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని వివరించారు.

ఒక సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి పెద్ద కత్తితో తిరుగుతూ కనపడ్డాడు. ట్రైనులో ఎక్కడ చూసినా రక్తం కనిపించింది. ప్రజలు వాష్‌రూమ్‌లలో దాక్కున్నారు.

రైలు ఆగిన తర్వాత ప్లాట్‌ఫాంపై కత్తిని పట్టుకున్న వ్యక్తిని చూశామని, పోలీసులు అతనిని టేసర్‌తో (విద్యుత్‌ షాక్‌ పరికరం) కిందపడేసి అదుపులోకి తీసుకున్నారని కొందరు సాక్షులు చెప్పారు.

యూకే ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ ఈ ఘటనను “చాలా భయంకరమైనది”గా పేర్కొన్నారు. బాధితులకు సానుభూతి తెలిపారు. వెంటనే స్పందించిన అత్యవసర సేవా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆ ప్రాంతంలో ఉన్న వారు పోలీస్‌ సూచనలను పాటించాలని అని స్టార్మర్‌ చెప్పారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ మంత్రి షబానా మహ్మూద్‌ ధ్రువీకరించారు.