ఎంత ఆశో..: విమానాన్ని దొంగిలించబోయి పట్టుబడ్డ యువతి

చిల్లర దొంగల, జేబు దొంగ వయస్సులో ఏకంగా విమానానికే ఎసరు పెట్టింది 17ఏళ్ల బాలిక. ఏ దొంగైనా బంగారం, డబ్బు, విలువైన వస్తువులను టార్గెట్ చేస్తాడు. అలాంటిది విమానాన్నే కొట్టేయాలనుకుంది. గాల్లోకి వెళ్తే ఎవరు పట్టుకుంటారులే అనుకుని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. 

కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో యొసెమైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. విమానాశ్రయం చుట్టూ ఉన్న ఫెన్సింగ్  దాటుకొని ఓ బాలిక ఎవ్వరికంటా పడకుండా కింగ్ ఎయిర్ 200 అనే ప్రైవేట్ విమానంలోకి దూరింది. కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి దాన్ని స్టార్ట్ చేసింది. 

క్షణాల్లో విమానం గాల్లోకి ఎగరేయాలని భావించింది. దానిపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో నేలపై కొన్ని చక్కర్లు కొట్టించింది. విమానం వేగంతో దగ్గర్లోని భవనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం, ఆ భవనం కొంత మేర దెబ్బతిన్నాయని ఫ్రెస్నో పోలీసు అధికారి వెల్లడించారు.