బాత్రూంలో ఐఫోన్ ఛార్జింగ్.. క్షణాల్లో ప్రాణాలు వదిలిన మహిళ

బాత్రూంలో ఐఫోన్ ఛార్జింగ్.. క్షణాల్లో ప్రాణాలు వదిలిన మహిళ

Updated On : December 15, 2020 / 8:58 PM IST

మరోసారి స్మార్ట్ ఫోన్ వాడకం ప్రాణాలను హరించింది. ఛార్జింగ్ పెట్టి బాత్ టబ్ లో స్నానం చేస్తున్న మహిళకు షాక్ కొట్టి ప్రాణాలు వదిలేసింది. రష్యాలోని అర్ఖంగెల్స్‌క్‌ నగరంలో షాకింగ్ ఘటన జరిగింది. గతంలో ఆమె బాత్‌టబ్‌లో ఉండగా తీసుకున్న సెల్ఫీ వీడియో తాజాగా వైరల్‌గా మారింది.

ఒలేసియా సెమెనోవా (24) అనే మహిళ స్నానం చేస్తుండగా ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. పక్కనే ఛార్జింగ్ మోడ్‌లో ఉన్న ఐఫోన్ 8 టబ్‌లో పడిపోయింది. అది గమనించేలోపే.. ఒక్కసారిగా ఆమెకు కరెంట్ షాక్ తగిలింది. దీంతో బాత్ టబ్ లోనే మహిళ ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె ఫ్రెండ్ ముట్టుకోబోయే సరికి తనకు కూడా కరెంట్ షాక్ కొట్టింది.

తేరుకున్న ఆమె డారియా పోలీసులకు సమాచారం అందించింది. ‘టబ్‌లో అచేతనంగా పడి ఉన్న ఆమెను చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యా. గట్టిగా పిలిచా.. పలకలేదు. ఆమెను తాకినప్పుడు నాకు కూడా షాక్ కొట్టింది. అప్పటికి ఇంకా వాటర్‌లోనే ఉన్న స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ అవుతూనే ఉంది’ అని మహిళ ఫ్రెండ్ తెలిపింది.

ఛార్జింగ్‌లో పెట్టినప్పుడే ఐఫోన్‌ బాత్‌టబ్‌లో పడిందని, దీంతో విద్యుత్‌షాక్‌తో సెమెనోవా మృతిచెందినట్లు పారామెడిక్స్ ధ్రువీకరించింది. 2019 లో 26 ఏళ్ల రష్యన్ మహిళ, ఆగస్టులో మాస్కోలో 15 ఏళ్ల బాలిక ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు దేశంలో ఈ తరహా మరణాలు సంభవించడంతో స్పందించిన రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. వాటర్‌, విద్యుత్‌ మెయిన్‌లకు అనుసంధానించబడిన విద్యుత్ ఉపకరణాలు ప్రమాదకరమని, అప్రమత్తంగా ఉండాలంటూ ప్రకటన విడుదల చేసింది.