ముగ్గురు అమ్మాయిల గోర్లు పీకి, వేళ్లు నరికి, కొట్టి, ఊపిరాడకుండా చేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌..

ఆ గ్యాంగ్ ఎంతగా టార్చర్‌ పెట్టిందంటే ఆ చిత్రహింసలు తట్టుకోలేక ఆ ముగ్గురు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు.

ముగ్గురు అమ్మాయిల గోర్లు పీకి, వేళ్లు నరికి, కొట్టి, ఊపిరాడకుండా చేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌..

Updated On : September 28, 2025 / 5:04 PM IST

Buenos Aires protests: డ్రగ్స్‌ గ్యాంగుల ఆగడాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. తమ జోలికి వస్తే ఎంతకి తెగిస్తామో తెలిపేలా వ్యవహరిస్తున్నాయి. తమకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే భూమిపైనే నరకాన్ని చూపిస్తున్నాయి.

అర్జెంటీనాలో ఓ డ్రగ్స్‌ గ్యాంగ్ ఇటీవల ముగ్గురు అమ్మాయిలపై అతి దారుణ ఘటనకు పాల్పడింది. ఆ ముగ్గురినీ టార్చర్‌ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో చూపించింది. ఎంతగా టార్చర్‌ పెట్టిందంటే ఆ చిత్రహింసలు తట్టుకోలేక ఆ ముగ్గురు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. వారి పేర్లు లారా (15), బ్రెండా (20), మోరెనా (20). (Buenos Aires protests)

Also Read: గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ.. ఇక్కడ చెక్‌ చేసుకోండి..

దీంతో వేలాది మంది నిరసనకారులు అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఐరెస్‌ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ ఘటన అర్జెంటీనాను కుదిపేసింది. బాధితుల కుటుంబ సభ్యులు “లారా, బ్రెండా, మోరెనా” పేర్లతో ఉన్న బ్యానర్‌, వారి చిత్రాలతో ఉన్న ఫ్లకార్డులు పట్టుకుని పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లారు. స్త్రీవాద సంఘం నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో ఆందోళనకారులు డప్పులు మోగించారు.

మోరెనా, బ్రెండా, మోరెనా అదృశ్యమైన ఐదు రోజుల తర్వాత వారి మృతదేహాలు ఓ చోట బయటపడ్డాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదకద్రవ్య గ్యాంగ్‌లు ఈ ఘోరానికి పాల్పడ్డాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో వారు ప్రత్యక్ష ప్రసారంగా చేస్తున్న సమయంలో ఆ దృశ్యాలను ఒక ప్రైవేట్‌ అకౌంట్‌లోనూ 45 మంది ఒకేసారి చూశారు.

ఆ వీడియోలో డ్రగ్స్‌ గ్యాంగ్‌ లీడర్‌ మాట్లాడుతుండగా వినపడింది. “నా వద్ద నుంచి డ్రగ్స్‌ దొంగిలిస్తే ఇలా జరుగుతుంది” అని అతడు అన్నాడు. అర్జెంటీనా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుల వేళ్లు నరికి, గోర్లు పీకి, కొట్టి, ఊపిరాడకుండా చేసి హతమార్చారు.

మహిళలకు రక్షణ కావాలని బ్రెండా తండ్రి లియోనెల్‌ డెల్‌ కాస్టిలో అన్నారు. ఈ కేసులో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న 20 ఏళ్ల పెరూ అనే వ్యక్తి ఫొటోను అధికారులు విడుదల చేశారు. అతను ఇంకా పరారీలో ఉన్నాడు.

మా ప్లాట్‌ఫామ్‌లో లైవ్‌ రాలేదు: మెటా
ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా ఈ లైవ్‌ వీడియో తమ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కాలేదని అంటోంది. “ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ప్రత్యక్ష ప్రసారం జరిగిందని తెలిపేందుకు ఎటువంటి ఆధారాలు మాకు దొరకలేదు. మా టీమ్‌ ఈ భయానక నేరాన్ని దర్యాప్తు చేస్తున్న వారికి సహకరిస్తోంది” అని ఇన్‌స్టా ప్రతినిధి మీడియాకు తెలిపారు.