ఇరాన్‌కు గుండెకాయలాంటి ముగ్గురి మృతి.. ఇజ్రాయెల్‌ దాడి ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది?

మిడిల్ ఈస్ట్‌లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

ఇరాన్‌కు గుండెకాయలాంటి ముగ్గురి మృతి.. ఇజ్రాయెల్‌ దాడి ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది?

Updated On : June 13, 2025 / 5:14 PM IST

మిడిల్ ఈస్ట్‌లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ ఎవరూ ఊహించని విధంగా జరిపిన భారీ దాడిలో ఇరాన్ సైనిక వ్యవస్థకు గుండెలాంటి ముగ్గురు అత్యున్నత అధికారులు మరణించారు. ఈ “ఆపరేషన్ రైజింగ్ లయన్‌”తో ఇరాన్ తీవ్ర షాక్‌లో ఉండగా, ప్రపంచంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. తమ సైనిక వ్యూహాలకు కీలకమైన ముగ్గురు సైనిక నాయకులను ఇరాన్ కోల్పోయింది. ఈ దాడిలో చనిపోయిన ఆ ముగ్గురు శక్తిమంతులైన అధికారులు ఎవరు? దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ (IRGC చీఫ్)

ఇరాన్‌లోని అత్యంత శక్తిమంతమైన విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC)కు అధిపతి. దేశ సుప్రీం లీడర్‌ ఖమెనెయికి అత్యంత నమ్మినబంటు. గత ఏడాది ఇజ్రాయెల్‌పై జరిగిన వందలాది డ్రోన్లు, క్షిపణుల దాడికి ఈయనే సూత్రధారి. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలను పర్యవేక్షించే కీలక వ్యక్తి.

మేజర్ జనరల్ మొహమ్మద్ బాగెరీ (ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్)

ఇరాన్‌లోని మొత్తం 5 లక్షల మంది సైన్యానికి చీఫ్ ఈయన. దేశ సైనిక కార్యకలాపాలన్నింటికీ బాధ్యత వహించే వ్యక్తి. అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఈయన.. సౌదీ అరేబియాతో శాంతి చర్చల్లో కూడా కీలక పాత్ర పోషించారు.

అలీ షమఖానీ (మాజీ జాతీయ భద్రతా చీఫ్)

ఇరాన్ జాతీయ భద్రతా మండలికి 10 ఏళ్ల పాటు చీఫ్‌గా పనిచేశారు. దేశ భద్రతా వ్యూహాలను రూపొందించడంలో దిట్ట. చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియాతో దౌత్య సంబంధాలను పునరుద్ధరించిన ఘనత ఈయనదే. ఇరాన్ అధ్యక్ష పదవికి కూడా పోటీపడ్డారు.

ఇరాన్ తక్షణ స్పందన ఏంటి?

ఈ భారీ నష్టం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమెనెయి వెంటనే కొత్త నియామకాలు చేపట్టారు.

కొత్త IRGC చీఫ్: మొహమ్మద్ పాక్‌పూర్

కొత్త ఆర్మీ చీఫ్: అబ్దుల్ రహీం మౌసవి

ఈ దాడి ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఈ ఘటనను కేవలం ఒక సైనిక దాడిగా చూడలేం. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుంది. ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకేసారి ముగ్గురు టాప్ జనరల్స్‌ను కోల్పోవడం ఇరాన్ సైనిక నాయకత్వాన్ని బలహీనపరుస్తుంది.

ప్రతీకార దాడుల ప్రమాదం: ఇరాన్ తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది మధ్యప్రాచ్యంలో మరో పెద్ద యుద్ధానికి దారితీయవచ్చు.

ప్రపంచ శాంతికి ముప్పు: ఈ ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు పెరగవచ్చు. ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లవచ్చు.

ఈ పరిణామం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనని ప్రపంచం మొత్తం ఆందోళనతో ఎదురుచూస్తోంది.