Kenya : ఘోరం.. జీసస్‌ని కలుసుకోవాలని 47మంది ఆత్మహత్య, చర్చి పాస్టర్ చెప్పాడని..
Kenya : ఈ నెల 11న 11 మృతదేహాలు, నిన్న మరో 26 డెడ్ బాడీలను పోలీసులు వెలికితీశారు. మిగతా వారి మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

Kenya(Photo : Google)
Kenya : మనిషి ఎంతో అభివృద్ధి సాధించాడు. స్పేస్ టూరిజం దిశగా టెక్నాలజీ డెవలప్ అయ్యింది. మనిషి ఎన్నో ఘన విజయాలు సాధించాడు. అయినా, ఇంకా మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాల నుంచి మనిషి బయటపడలేకపోతున్నాడు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. దొంగ బాబాలు, నకిలీ మత గురువుల మాయలో పడి అడ్డంగా మోసపోతున్నారు. వాళ్లు చెప్పింది గుడ్డిగా నమ్మి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా, జీసన్ ను కలవాలనే కోరికతో ఏకంగా 47మంది సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఓ పాస్టర్ వికృత బోధనలకు అమాయకులు బలైపోయారు. తవ్వేకొద్దీ శవాలు బయటపడుతూనే ఉన్నాయి.
కెన్యాలోని కిల్ఫీ ప్రావిన్స్ లో దారుణం జరిగింది. జీసస్ ను కలుసుకోవాలంటే కఠిన ఉపవాసం చేసి మరణించాలంటూ చర్చి పాస్టర్ మాకెంజీ భక్తులను ప్రభావితం చేశాడు. అతడు చెప్పినట్లు చేసి 47మంది బలవనర్మణానికి పాల్పడ్డారు. ఓ అడవిలో ఈ నెల 11న 11 మృతదేహాలు, నిన్న మరో 26 డెడ్ బాడీలను పోలీసులు వెలికితీశారు. మిగతా వారి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.
మలిందిలోని షాకహోలా అడవిలో మృతదేహాలను భద్రతా దళాలు వెలికితీస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అధికారులు దర్యాఫ్తు జరుపుతున్నారు. చర్చి పాస్టర్ మాకెంజీ తన అనుచరులను ఆత్మహత్య చేసుకునేలా ప్రభావితం చేశారు. కేవలం మృతదేహాల కోసం మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనా ప్రాణాలతో బతికి ఉన్నారా? అని గాలిస్తున్నారు.
ఈ ఘటన తర్వాత 800 ఎకరాల విస్తీరణంలో ఉన్న షాకహోలా అడవిని పోలీసులు సీజ్ చేశారు. గాలింపు చర్యల్లో సమాధుల్లో పాతిపెట్టిన మరిన్ని మృతదేహాలు కనుగొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చిలోని 15 మంది సభ్యులు గత వారం రక్షించబడ్డారు. ఇంతటి దారుణానికి కారణమైన చర్చి పాస్టర్ పాల్ మాకెంజీ న్తెంగే ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
Also Read..Beautiful tourist place : అక్కడ సెల్ఫీ క్లిక్ చేశారా అంతే .. భారీ మూల్యం తప్పదు
భద్రతా బలగాలు ఇప్పటివరకు 58 సమాధులను గుర్తించారు. జీసస్ ని కలిసేందుకు కఠిన ఉపవాసం చేసి మరణించేందుకు 1,000 మంది కంటే ఎక్కువ మంది వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆకలితో చనిపోయారని అనుమానించబడిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను కనుగొన్న తర్వాత ఏప్రిల్ 15న చర్చి పాస్టర్ ను అరెస్ట్ చేశారు.