“అయ్యబాబోయ్.. హోటల్ బయట భారీ మొసలి, షాకైన పర్యాటకులు.. వీడియో వైరల్

"డ్యామ్! ఇది నిజంగానే మొసలే!" అని అరవడం వీడియోలో రికార్డ్ అయ్యింది.

“అయ్యబాబోయ్.. హోటల్ బయట భారీ మొసలి, షాకైన పర్యాటకులు.. వీడియో వైరల్

6-foot long alligator spotted outside motel room in Virginia

Updated On : June 17, 2025 / 2:13 PM IST

అమెరికాలోని వర్జీనియాలో ఒక ప్రశాంతమైన రాత్రి… మోటెల్‌లో బస చేసిన పర్యాటకులు గాఢ నిద్రలో ఉన్నారు. అక్కడే బయట మాత్రం ఏదో కదులుతోంది. గుర్తించిన పర్యాటకులు పోలీసులకు ఫోన్ చేశారు. తెల్లవారుజాముమే అక్కడికి వచ్చిన పోలీసులు అక్కడ 6 అడుగుల పొడవైన భారీ మొసలిని చూసి షాకయ్యారు. హోటల్ పార్కింగ్ స్థలంలో మొసలి స్వేచ్ఛగా తిరుగుతూ కనపడింది. ఈ ఊహించని ఈ సంఘటన పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసింది.

ఫెయిర్‌ఫ్యాక్స్ కౌంటీ పోలీసులు విడుదల చేసిన అధికారిక బాడీ-క్యామ్ వీడియోలో ఆ మొసలికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఒక అధికారి.. “డ్యామ్! ఇది నిజంగానే మొసలే!” అని అరవడం వీడియోలో రికార్డ్ అయ్యింది. మరొక అధికారి దాని పరిమాణాన్ని చూసి “నేను పక్కన పడుకుంటే, దీని పొడవు నాతో సమానంగా ఉంటుంది, అంటే దాదాపు 6 అడుగులు” అని అన్నారు.

సోషల్ మీడియాలో నవ్వుల పువ్వులు

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవ్వగానే, నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. “బహుశా అది జూలై 4 పరేడ్ చూడటానికి వచ్చిందేమో!” అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు. “పాపం, దానికి రూమ్ దొరకలేదేమో!” అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.

మొసలి అక్కడికి ఎలా వచ్చింది?

అందరినీ భయపెట్టిన ఈ మొసలి కథ చివరకు సుఖాంతమైంది. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన నిజాలు బయటపడ్డాయి. ఈ మొసలికి ఒక యజమాని ఉన్నారు. అతను దానిని న్యూయార్క్ నుంచి నార్త్ కరోలినాలోని ఒక జూకు తన వాహనంలో తరలిస్తున్నాడు. ప్రయాణం చేస్తున్న సమయంలో ఫెయిర్‌ఫ్యాక్స్‌లోని మోటెల్ వద్ద ఆగగా, అది వాహనం నుండి ఎలాగో తప్పించుకుని బయటకు వచ్చింది.

సమాచారం అందుకున్న యానిమల్ ప్రొటెక్షన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఎంతో చాకచక్యంగా, మొసలికి ఎలాంటి హాని కలగకుండా దానిని పట్టుకుని, యజమాని వాహనం వద్దకు చేర్చారు.

వర్జీనియా చట్టాలు ఏం చెబుతున్నాయి?

అయితే, కథ ఇక్కడితో ముగియలేదు. వర్జీనియా రాష్ట్ర చట్టాల ప్రకారం, స్థానికేతర జాతులకు చెందిన ఇలాంటి జంతువులను వ్యక్తిగతంగా పెంచుకోవడం చట్టవిరుద్ధం. ఫెయిర్‌ఫ్యాక్స్ కౌంటీ పోలీస్ విభాగ ప్రతినిధి మాట్లాడుతూ.. “రాష్ట్ర చట్టాల ప్రకారం ఆ మొసలిని కౌంటీలో ఉంచడానికి అనుమతి లేదు. అందువల్ల, మేము యజమానిని, మొసలిని సురక్షితంగా కౌంటీ సరిహద్దులు దాటించి పంపించాము” అని తెలిపారు.