కరోనా ట్రీట్మెంట్ కు “ఎబోలా డ్రగ్”…ఆమోదించిన అమెరికా

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2020 / 06:45 AM IST
కరోనా ట్రీట్మెంట్ కు “ఎబోలా డ్రగ్”…ఆమోదించిన అమెరికా

Updated On : May 2, 2020 / 6:45 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న క‌రోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డ పేషెంట్ల ట్రీట్మెంట్ కు ఎక్సపరిమెంటల్ యాంటీ వైరల్ డ్రగ్- రెమ్‌ డెసివిర్ ను ఉపయోగించేందుకు అమెరికా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన రోగులకు అత్యవసర మెడిసన్‌గా రెమ్‌డెసివిర్‌ యాంటీ వైర‌ల్ ఇంజక్షన్‌ను వాడొచ్చునని తెలిపింది. ఇక కరోనా పుట్టుకొచ్చిన తర్వాత.. వైరస్‌ చికిత్సకు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ జరుపుకొని బయటికొచ్చిన తొలి మెడిసిన్‌ ఇదే కావడం విశేషం. 

ఎబోలా ట్రీట్మెంట్ కోసం గతంలో తీసుకొచ్చిన రెమ్ డిసివర్ ను తీవ్ర‌మైన కోవిడ్19 పేషెంట్లకు ఇచ్చేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA)ఆమోదం తెలిపింది. కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి ఈ డ్ర‌గ్ ఇవ్వ‌డం వ‌ల్ల వాళ్లు తొంద‌ర‌గా కోలుకున్న‌ట్లు ఎఫ్‌డీఏ గుర్తించింది. కానీ రెమ్‌ డెసివిర్‌ను సునిశితంగా ప‌రిశీలించ‌నున్న‌ట్లు ఎఫ్‌డీఏ చెప్పింది. ఎబోలా ట్రీట్మెంట్ కోసం గిలీడ్ ఫార్మ‌సీ కంపెనీ ఈ డ్రగ్ ను ఉత్ప‌త్తి చేసింది. కానీ దీన్ని మ్యాజిక్ బుల్లెట్‌గా చూడ‌కూడ‌ద‌ని వార్నింగ్ కూడా ఇచ్చారు.

గిలీడ్ కంపెనీ సుమారు 15 ల‌క్ష‌ల ఔష‌ధాల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ఆ సంస్థ సీఈవో డానియ‌ల్‌.. అధ్య‌క్షుడు ట్రంప్‌కు తెలిపారు. కోవిడ్‌19 చికిత్స కసం ఇది తొలి ఆమోదిత ఔష‌ధ‌మ‌న్నారు. ఇక రెమ్‌ డెసివిర్‌కు అనుమతులు వచ్చిన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇది నిజంగా ఆశాజనక పరిస్థితి అని తెలిపారు. వైట్‌ హౌజ్‌లో గిలీడ్‌ సైన్సెస్‌ సీఈఓ డానియెల్‌  ఓడేతో ఆయన ముచ్చటించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల బాగుకోసం ఇది తొలి అడుగు అని ఓడే తెలిపారు. నిస్వార్థంగా రెమ్‌ డెసివిర్‌తో వారికి సేవ చేస్తామని చెప్పారు. 

అమెరికాలో జరిగిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు బుధవారం విడుద‌లయ్యాయి. ఈ మందు చాలా స్ఫష్టమైన పనితీరును కనబరిచినట్టు ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త ఆంథొనీ ఫాచీ తెలిపారు. కేవలం ప్రాథమిక చికిత్స తీసుకున్న కరోనా రోగులతో పోలిస్తే.. రిమ్‌డిసివిర్ తీసుకున్న వారు 31 శాతం తొందరగా కోలుకున్నట్టు అమెరికాలోని అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్చువస్‌ డిసీజెస్‌ వెల్లడించింది. ఇది వైరస్ యొక్క జన్యువులో కలిసిపోయి, దాని ప్రతిరూపణ ప్రక్రియను తగ్గించేస్తుందని తెలిపింది.  అయితే, మరణాలను తగ్గించడంలో ఈ మెడిసన్‌ ప్రభావం చూపలేదని వైద్య వర్గాలు తెలిపాయి. 

Also Read | కోవిడ్-19 వ్యాక్సిన్ దిశగా భారత్ మరో కీలక ముందడుగు