Earthquake Hits Nepal : నేపాల్‌లో 69కు పెరిగిన భూకంప మృతుల సంఖ్య…ప్రధాని పుష్పకమల్ సంతాపం
నేపాల్ దేశంలో శుక్రవారం అర్దరాత్రి సంభవించిన భారీ భూకంపం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల నేపాల్ దేశంలో మృతుల సంఖ్య 69కు పెరిగింది....

Earthquake Hits Nepal
Earthquake Hits Nepal : నేపాల్ దేశంలో శుక్రవారం అర్దరాత్రి సంభవించిన భారీ భూకంపం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల నేపాల్ దేశంలో మృతుల సంఖ్య 69కు పెరిగింది. హిమాలయ దేశానికి పశ్చిమాన శుక్రవారం రాత్రి 18 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత రాజధాని న్యూఢిల్లీ వరకు భూ ప్రకంపనలు సంభవించాయి.
Also Read : Nepal Earthquake : నేపాల్‌లో భారీ భూకంపం…37 మంది మృతి
జాజర్ కోట్ జిల్లాలో భూకంపం వల్ల 26మంది మరణించారని జాజర్‌కోట్ జిల్లా చీఫ్ సురేష్ సునర్ చెప్పారు. రాత్రి వేళ కావడంతో మృతుల సమాచారం పొందడం కష్టంగా మారిందని, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని జిల్లా అధికారులు చెప్పారు. పొరుగున ఉన్న రుకుమ్ వెస్ట్‌లో భూకంపం వల్ల 30 మంది మరణించారని ఆ ప్రాంత పోలీసు చీఫ్ నమ్‌రాజ్ భట్టారాయ్ తెలిపారు. తాము సహాయ చర్యలు చేపట్టామని నేపాల్ పోలీసులు చెప్పారు. నేపాల్ ఒక ప్రధాన భౌగోళిక లోపంపై ఉంది.
Also Read : Delhi-NCR Earthquake : నేపాల్ భూకంపం ఎఫెక్ట్…ఢిల్లీ,ఎన్సీఆర్ ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు
ఇక్కడ భారతీయ టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్‌లోకి నెట్టి హిమాలయాలను ఏర్పరుస్తుంది. దీనివల్ల భూకంపాలు సంభవించడం సర్వ సాధారణంగా మారింది. భూకంప ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రభుత్వం భద్రతా బలగాలను మోహరించింది. భూకంపం వల్ల భారీ ఆస్తి నష్టం సంభవించిందని నేపాల్ దేశ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి నారాయణ్ ప్రసాద్ భట్టారాయ్ తెలిపారు. భూకంప మృతులకు నేపాల్ ప్రధాని పుష్పకమల్ సంతాపం తెలిపారు.
Also Read : Delhi-NCR : ఢిల్లీని కుదిపేసిన భూకంపం..ఊగిన ఫ్యాన్లు, పగిలిన భవనాల కిటికీల అద్దాలు
2015వ సంవత్సరంలో నేపాల్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 9 వేలమంది మరణించారు. అప్పట్లో అర మిలియన్లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. గత ఏడాది నవంబర్ నెలలో జాజర్‌కోట్ సమీపంలోని దోటి జిల్లాలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు ఆరుగురు మరణించారు. ఉత్తర భారతదేశంలో ఉన్న లక్నో, పాట్నా నగరాల్లో భూకంపం సంభవించినట్లు భారతీయ సోషల్ మీడియా వినియోగదారులు నివేదించారు.