ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆందోళనలు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఆందోళనలకు పలువురు మద్దతు ప్రకటించగా.. అమెరికా, కెనడాలోని తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీలు రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు అక్కడి నుంచి మద్దతు ప్రకటించారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయడానికి తమ భూమిని ఇచ్చిన రైతులు అమరావతి రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వన్ స్టేట్.. వన్ కాపిటల్ నినాదంతో కెనడాలోని టోరెంటోలో ఎన్ఆర్ఐ రైతు బిడ్డలం అంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సేవ్ అమరావతి నినాదంతో వారు నిరసన ప్రదర్శనలు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఎన్‌ఆర్‌ఐలు నిరసన చేపట్టారు. ‘సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. బాల్బిమోర్, చార్లట్, ర్యాలీ, మిన్ని యాపోలిస్, కొలంబస్, డల్లాస్, అట్లాంటా, సెయింట్, లూయిస్, బోస్టన్, కాలిఫోర్నియా, హ్యూస్టన్, ఒమాహ, కాన్వాస్ సిటీ, పోర్ట్ ల్యాండ్ తదితర ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించారు.
వర్జీనియాలోని చాంటిల్లీలో నిరసనకారులు బ్యానర్లు మరియు ప్లకార్డులు పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనను వ్యతిరేకించారు. నిరసనలలో భాగంగా “ఒక రాష్ట్రం, ఒక రాజధాని”, “జై అమరావతి, సేవ్ అమరావతి” అనే ప్లకార్డులను వారు పట్టుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం 2015 లో 33,000 ఎకరాల భూమిని ఇచ్చిన అమరావతిలో 29 గ్రామాల్లోని రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.