Tokyo Olympics 2020
Tokyo Olympics 2020 : ఆటలో గెలుపు ఓటములు సహజం. ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోతారు. గెలుపోటములనేవి సమానంగా తీసుకోవాలి. ఈ సత్యాన్ని గుర్తిస్తే ఆటలోనైనా.. జీవితంలోనైనా ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవచ్చు. టోక్కో ఒలింపిక్స్ వేదికగా ఈ విషయాన్ని చాటి చెప్పాడు ఓ కోచ్. ఓటమితో బాధలో ఉన్న ఓ ప్లేయర్‌కు ఆమె కోచ్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఇన్నాళ్లు నీ వెంట నేనున్నా.. ఇకపై నా వెంట నువ్వుంటావా? అని మీడియా వేదికగా లవ్ ప్రపొజల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో తొలి రౌండ్‌లోనే అర్జెంటీనా ఫెన్సర్ మారియా బెలెన్ పెరెజ్ మారిస్ పరాజయం పాలై నిరాశకు గురైంది. తన ప్రదర్శనపై మీడియాతో మాట్లాడుతోంది. ఈ సమయంలో ఆమె కోచ్ లుకాస్ ససిడో మారిస్ వెనుకే నిల్చున్నాడు. మారిస్ తీవ్ర నిరాశలో ఉంది. మళ్లీ ఆమె ముఖంలో నవ్వులు పూయించడానికి ఇదే సరైన సమయం అని భావించిన కోచ్.. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని వారి మాతృ భాషలో రాసిన ఒక పేపర్ పట్టుకుని ఆమె వెనుకే నిలబడ్డాడు. ఇది చూసిన మీడియా ప్రతినిధులు బిగ్గరగా నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో మారిస్ కు అర్థం కాలేదు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసింది. కోచ్ ప్రేమ అభ్యర్థనను చూసి ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది. ఆ వెంటనే అతడి ప్రేమ అభ్యర్థనను అంగీకరించింది.
బెలెన్ మూడుసార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంది. బెలెన్‌కు లుకాస్ 17ఏళ్లుగా కోచ్‌గా ఉన్నాడు. 2010లో పారిస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లోనూ కోచ్ లుకాస్ ఇదే విధంగా ప్రపోజ్ చేశాడు. అయితే అప్పుడు ‘నువ్వు జోక్ చేస్తున్నావా?’ అని చెప్పి లైట్‌గా తీసుకుంది. ఇప్పుడు 11ఏళ్ల తర్వాత 2021లో అదే విధంగా ప్రపోజ్ చేయడంతో ఆమె చివరకు లుకాస్‌ను అంగీకరించింది. తాము పెళ్లి చేసుకుంటామని మీడియా ముఖంగానే ప్రకటించారు. ఈ లైవ్ లవ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వల్ప వ్యవధిలోనే 2లక్షల వ్యూస్ వచ్చాయి.
కోచ్ తో రిలేషన్ షిప్ గురించి మారిస్ మాట్లాడింది. ఇద్దరమూ కలిసి బ్యూనస్ ఎయిర్స్ లో బిగ్ బార్బిక్యూలో వేడుక చేసుకుంటామంది. ”మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. మేమిద్దరం మంచి పార్టనర్స్. మా ఇద్దరి మధ్య గొడవలు సహజం. అయితే మేము బాగా ఎంజాయ్ చేస్తాం. ఒకరినొకరు బాగా ప్రేమించుకుంటున్నాం. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం” అని మారిస్ చెప్పింది.
Y después del combate de esgrima le pidieron casamiento a María Belén Pérez Maurice en vivo. pic.twitter.com/wEmGuOW7CB
— Rústico (@lautarojl) July 26, 2021