Donald Trump-Meloni : తగ్గేదేలే.. ట్రంప్ నోట మళ్లీ అదేమాట.. మెలోనీ అలానే ఫొటో అడిగారంటూ..
Donald Trump-Meloni : G7 శిఖరాగ్ర సమావేశానికి ముందు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. మెలోని ఫొటో అభ్యర్థనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు మళ్లీ ప్రస్తావించారు..
Donald Trump-Meloni
- G7 సదస్సులో మెలోని పదేపదే ఫోటోలు అడిగారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ
- రన్‌వే కోసం ఇటలీ అనుమతించలేదని అమెరికా అధ్యక్షుడు విమర్శ
- ట్రంప్ ఆరోపణలన్నీ కల్పితం, అసత్యమన్న ఇటలీ ప్రధాని జార్జియో
- ఇటలీ ఎవరినీ యాచించదు, మిత్రదేశాలను గౌరవించడం ముఖ్యం
Donald Trump-Meloni : అంతర్జాతీయ రాజకీయాల్లో నేతల మధ్య చిన్న వ్యాఖ్యలు కూడా పెద్ద వివాదాలకు దారితీయడం చాలా కామన్. ఈసారి ఫొటో, రాజకీయ సంబంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఇద్దరు నేతలు ఒకరి ఆరోపణలపై మరొకరు తీవ్రంగా స్పందించడంతో ఈ అంశం అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారింది.
ట్రంప్ అస్సలు తగ్గడం లేదు.. మెలోనీకి మళ్లీ కౌంటర్ ఇచ్చారు.. ఈసారి కూడా అదే మాటను మళ్లీ అన్నారు.. ఇటలీ ప్రధాని మెలోనీ తనను పదేపదే ఫోటో కోసం ప్రాధేయపడ్డారని అన్నారు. ఫస్ట్ ట్రంప్ ఇదే మాట అనడంతో మెలోనీ గట్టిగానే బదులిచ్చారు. తానేమి ఫొటో కోసం అడుక్కోలేదని అన్నారు. ఆ తర్వాత ఇరువురి వివాదం అంతటితో ఆగిపోయిందనుకుంటే ట్రంప్ అదే మాటల యుద్ధానికి మళ్లీ ఆజ్యం పోశారు.
జీ7 సదస్సు సందర్భంగా మెలోని తనతో ఫోటో దిగేందుకు పదేపదే ప్రయత్నించారని ట్రంప్ ‘ట్రూత్’ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. ఇటలీలో తన పాపులారిటీ ప్రభావం తగ్గుతున్నందువల్లే ఆమె అలా చేస్తోందని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
అంతటితో ఆగకుండా ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించే విషయంలో మెలోని అమెరికాకు మద్దతు ఇవ్వలేదని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ వివాదం సమయంలో ఇటలీ తన రన్వేలు, ల్యాండింగ్ స్ట్రిప్‌లను అమెరికాను వాడుకోవడానికి అనుమతించలేదని, దీని కారణంగా అమెరికాకు లాజిస్టికల్ సమస్యలు తలెత్తాయని కూడా ఆయన అన్నారు.
ఇటలీ విధానాలపై ట్రంప్ విమర్శలు :
ఇటలీ, ఇతర నాటో మిత్రదేశాల భద్రతకు యునైటెడ్ స్టేట్స్ చాలా కాలంగా సాయపడుతోందని, అయినప్పటికీ ఇటలీ సహకరించలేదని ట్రంప్ పేర్కొన్నారు. మెలోని ఇప్పుడు స్నేహం నటిస్తూ తన రాజకీయ స్థానాన్ని బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ట్రంప్ వ్యాఖలను ఖండించిన మెలోని .. :
ఇటీవలే అమెరికా అధ్యక్షుడు మెలోనితో ఫోటో దిగడంపై వ్యాఖ్యానించారు. ఇటలీ ప్రధాని సూటిగా స్పందిస్తూ.. ట్రంప్ వాదనలు పూర్తిగా కల్పితమని కొట్టిపారేశారు. ఆ వ్యాఖ్యలకు తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. తాను ఎవరినీ ఫొటో కోసం అభ్యర్థించలేదని ఇటలీ కూడా అలాంటి అభ్యర్థన చేసిందని చెప్పడం అబద్ధమని మెలోని తీవ్రంగా ఖండించారు.
ఇటలీ ఎవరినీ యాచించదు :
ట్రంప్ తన మిత్రదేశాలపై అంత కఠినమైన భాషను వాడటం, పాశ్చాత్య శత్రువుల పట్ల అదే కఠినత్వాన్ని ప్రదర్శించకపోవడం తనను చాలా బాధించిందని మెలోని పేర్కొన్నారు. ఇటలీ గానీ, తాను గానీ ఎన్నడూ యాచించబోమని తేల్చిచెప్పారు. ఈ ప్రకటనతో ఇద్దరు అంతర్జాతీయ నేతల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది.
