‘హాట్ ఫైర్’ టెస్ట్‌లో సానుకూల ఫలితాలు.. ఐఎస్‌ఎస్‌ నుంచి రానున్న‌ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్

పరీక్షల ద్వారా సేకరించిన డేటాను విశ్లేషిస్తున్నారు.

Sunita Williams and Butch Wilmore

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకు రానున్నారు. 50 రోజులకు పైగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. నాసా, బోయింగ్‌ బృందాలు జులై 27న స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ జెట్‌ల హాట్ ఫైర్ టెస్ట్‌ను పూర్తి చేశాయి.

ఈ విషయాన్ని నాసా తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్ష జరిపిన వేళ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష నౌకలో ఉన్నారని నాసా చెప్పింది. పరీక్ష సమయంలో అంతరిక్ష నౌకలో ఉన్న సునీతా విలియమ్స్, విల్మోర్ కలిసి మొత్తం 28 థ్రస్టర్‌లలో 27 పరీక్షించారు. వాటి పనితీరును, హీలియం లీక్‌ను పరిశీలించారు. పరీక్షల ద్వారా సేకరించిన డేటాను విశ్లేషిస్తున్నారు.

ఇక ఏ రోజైనా సరే భూమి మీదకు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా వ్యోమగాములను తిరిగి తీసుకు వచ్చేముందు చేసుకునే ఏర్పాట్లలో భాగంగా ఈ పరీక్ష చేశారు. ఈ పరీక్షలో సానుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో ఆ ఇద్దరు వ్యోమగాములు ఏ రోజైనా సరే భూమి మీదకు రావచ్చని నాసా తెలిపింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రయాణించిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక జూన్‌ 5న ఐఎస్‌ఎస్‌‌కు చేరుకుంది. వారిది 10 రోజుల మిషన్‌.

జూన్ 14న వారిద్దరూ తిరుగుపయనం కావాల్సి ఉండగా థ్రస్టర్ సమస్యల కారణంగా వారు 50 రోజులకు పైగా అక్కడే ఉండిపోయారు. స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో హీలియం లీకేజీ వల్ల తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల భూమిపై ల్యాండింగ్‌ను వాయిదా వేస్తూ వస్తున్నారు. కొత్త తేదీని ఇప్పటికీ ప్రకటించలేదు. సమస్యలు తలెత్తినప్పటికీ వ్యోమగాములు సురక్షితంగానే ఉన్నారని నాసా అంటోంది. వారికి ఐఎస్‌ఎస్‌లో అన్ని సౌకర్యాలు అందుతున్నాయని చెబుతోంది.

ఎక్కువ రోజులు అంతరిక్ష కేంద్రంలోనూ ఉండడంతో వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన కూడా నెలకొంది. మొత్తానికి అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణంపై సస్పెన్స్ ఇప్పటికి వీడుతోంది.

Also Read: పాలస్తీనా అగ్రనేతలను ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం వెనకున్న ప్లాన్ ఏంటి.. అసలేం జరుగుతోంది?

ట్రెండింగ్ వార్తలు