Australian: భారతీయ విద్యార్థులకు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. ఆరు రాష్ట్రాలపై స్టూడెంట్ వీసా పరిమితులు విధింపు.. ఎందుకంటే..?

భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా షాకిచ్చింది. భారత్ లోని ఆరు రాష్ట్రాల నుంచి ఉన్నత విద్యకై ఆస్ట్రేలియా వెళ్లేందుకు స్టూడెంట్ వీసా కోసం చేసుకున్న దరఖాస్తులపై ..

Australian universities

Australian Universities: భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఎక్కువగా వెళ్లే దేశాలలో అమెరికా తరువాత ఆస్ట్రేలియా ఒకటి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ దేశంలోని విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో ఉన్నత విద్యకోసం వెళ్లిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాసైతం భారతీయ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తుంది. మోసపూరిత స్టూడెంట్ వీసా దరఖాస్తులు పెరిగాయనే కారణంతో అనేక ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారతదేశంలోని ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల దరఖాస్తులపై ఆంక్షలు విధించాయి.

Also Read: JD Vance: భారత్‌కు చేరుకున్న జేడీ వాన్స్.. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీలో ల్యాండ్.. వారు పర్యటించే ప్రాంతాలివే..

విద్యకు బదులుగా ఇమ్మిగ్రేషన్‌కు ప్రవేశ ద్వారంగా విద్యార్థి వీసాలను ఉపయోగించుకునే మోసపూరిత దరఖాస్తులు పెరుగుతున్నట్లు గమనించిన తర్వాత భారత్ లోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల వీసా నిబంధనలు కఠినతరం చేశాయి. నివేదికల ప్రకారం.. ఆస్ట్రేలియాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఆరు రాష్ట్రాల నుంచి దరఖాస్తులను అనుమతించడం పూర్తిగా ఆపేయగా.. మరికొన్ని విశ్వ విద్యాలయాలు నిబంధనలు కఠినతరం చేశాయి.

 

భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్తుంటారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని పలు విశ్వవిద్యాలయాలు తీసుకుంటున్న చర్యల కారణంగా ఉన్నత విద్యకోసం చట్టబద్ధమైన విధానంలో దరఖాస్తుదారులు చేసుకున్న విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారిందని భారతీయ విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో దౌత్య లేదా విధానపరమైన జోక్యాల ద్వారా సమస్యను పరిష్కరించకపోతే ఆస్ట్రేలియా యూనివర్శిటీల్లో ఉన్నత చదువులకోసం వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.