48గంటల్లో 48 మిలియన్ డాలర్లు విరాళం…కమలా హారిస్ ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించడమే కారణం

  • Published By: venkaiahnaidu ,Published On : August 14, 2020 / 05:39 PM IST
48గంటల్లో 48 మిలియన్ డాలర్లు విరాళం…కమలా హారిస్ ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించడమే కారణం

Updated On : August 14, 2020 / 6:24 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ ను ఎంచుకున్నట్టు జో బిడెన్ ప్రకటించగానే, ఆయన ప్రచారం నిమిత్తం విరాళాలు వెల్లువలా వచ్చాయి. తనతో పాటు కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీలో ఉంటారని రెండు రోజుల క్రితం బిడెన్ ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత 48గంటల్లో 48 మిలియన్ డాలర్లు జో బిడెన్ కాంపెయిన్ కి విరాళాలు వచ్చాయి.

ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని డెమోక్రాట్ వర్గాలు వ్యాఖ్యానించాయి. కమలా హారిస్ ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థినిగా ప్రకటించడమే ఇందుకు కారణమని సమాచారం. ఆది నుంచి పార్టీకి కంచుకోటగా ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో కమలా హారిస్ కు గట్టి మద్దతుంది. అక్కడి వ్యాపారులు, ప్రముఖులు పార్టీకి భారీగా విరాళాలు ఇస్తుంటారు. పైగా ఆమెకు భారత్, ఆఫ్రికన్ మూలాలు ఉండటం కలిసొస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

భారతీయ, జమైకా ఇమిగ్రెంట్ దంపతుల కూతురైన కమలా హారిస్ లోగడ శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా వ్యవహరించారు. దివంగతుడై న జోబిడెన్ కుమారునితో గతంలో ఈమె రిలేషన్ షిప్ లో ఉన్నారు.

ప్రస్తుతం కమలా కాలిఫోర్నియా నుంచి డెమోక్రటిక్ పార్టీ సెనేటర్‌గా ఉన్నారు. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు కాగా…ఆమె తండ్రి ఆఫ్రికాలోని జమైకా దేశస్థుడు. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ 1960లో తమిళనాడు నుంచి వలసవెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు.