యెమన్ తీరంలో ఘోర ప్రమాదం.. సముద్రంలో పడవ బోల్తా.. 68మంది మృతి.. 74మంది గల్లంతు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
యెమెన్ తీరంలోని సముద్ర జలాల్లో ఘోర ప్రమాదం జరిగింది. 154మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.

Boat sinking off Yemeni coast
Boat sinking off Yemeni coast: యెమెన్ తీరంలోని సముద్ర జలాల్లో ఘోర ప్రమాదం జరిగింది. 154మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 68మంది ఆఫ్రికన్ వలసదారులు మరణించగా.. 74 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఈ పడవలో ఇథియోపియన్ వలసదారులు ప్రయాణిస్తున్నట్లు యెమన్ లోని అంతర్జాతీయ వలస సంస్థ అధిపతి అబ్దుసత్తోర్ ఎసోయెవ్ తెలిపారు. 12 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు.
ఆ ప్రావిన్సులోని సీనియర్ ఆరోగ్య అధికారి అబ్దుల్ ఖాదిర్ బజమీర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కేవలం 12 మందిని మాత్రమే రక్షించాం. వారిలో పదకొండు మంది ఇథియోపియన్ జాతీయులు. ఒక్కరు యెమెన్‌కు చెందిన వారు ఉన్నారు. చాలా మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే, గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 154మంది ఇథియోపియన్ వలసదారులతో ప్రయాణిస్తున్న ఈ నౌక ఆదివారం తెల్లవారు జామున దక్షిణ యెమెన్ ప్రావిన్స్ అబ్యాన్‌లోని అడెన్ గల్ఫ్‌లో మునిగిపోయిందని అబ్దుసత్తోర్ ఎసోయెవ్ తెలిపారు.
హార్న్ ఆఫ్ ఆఫ్రికా, యెమెన్ మధ్య సముద్ర మార్గం ప్రమాదాల గురించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) పదేపదే హెచ్చరిస్తోంది. వలసదారులు ఎక్కువగా ఇథియోపియా, సోమాలియా నుండి పనికోసం సౌదీ అరేబియా లేదా ఇతర గల్ఫ్ దేశాలకు సముద్ర మార్గం ద్వారా వెళ్లే క్రమంలో తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే, అత్యంత ప్రమాదకరమైన మిశ్రమ వలస మార్గాల్లో ఒకటి అని ఐఓఎం ఒక ప్రకటనలో తెలిపింది.
2024లో 60వేల మందికిపైగా వలసదారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి యెమెన్ లోకి ప్రవేశించారని ఏజెన్సీ తెలిపింది. ఇది 2023లో97,200 మంది అత్యధికంగా ఈ ప్రాంతం గుండా ప్రయాణం సాగించారని నివేదిక తెలిపింది.