Pakistan Bomb Blast: మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పాకిస్తాన్‌లో భారీ బాంబ్ బ్లాస్ట్.. 40 మంది మృతి, 150 మందికి గాయాలు
జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUI-F) కార్మికుల సదస్సును లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడుకు పాల్పడ్డట్లు పాక్ పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

Pakistan Bomb Blast: పాకిస్తాన్‌లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. ఆదివారం ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలోని బజౌర్‌లో భారీ పేలుడు సంభవించింది. పాకిస్తాన్ ప్రధాన మీడియా ది డాన్ ప్రకారం.. తాజా పేలుడు కారణంగా ఇప్పటివరకు 40 మంది మరణించగా, 150 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
Highway Accidents and Deaths : హైవే ప్రమాదాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసా?
జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUI-F) కార్మికుల సదస్సును లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడుకు పాల్పడ్డట్లు పాక్ పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో, గాయపడిన వారిని సంఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి తరలిస్తున్నారు. బజౌర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి అధికారి ఫైజల్ కమల్ స్పందిస్తూ.. ‘‘ఇప్పటివరకు సుమారు 150 మంది గాయపడ్డారు. పేలుడు తర్వాత వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇందులో పేలుడు కనిపించింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది’’ అని అన్నారు.
జేయూఐఎఫ్ సీనియర్ నాయకుడు హఫీజ్ హమ్దుల్లా పాకిస్తాన్ వార్తా ఛానెల్ జియోతో మాట్లాడుతూ గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పేలుడులో జేయూఐఎఫ్ కు చెందిన ఒక నాయకుడు కూడా మరణించాడు. మృతి చెందిన నాయకుడిని జియావుల్లా జాన్‌గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిమార్గర, పెషావర్‌లకు పంపుతున్నట్లు అధికారి తెలిపారు.
పేలుడు ఎలా జరిగిందనేది పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాన్ఫరెన్స్ లోపల పేలుడు జరిగింది. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 5 అంబులెన్స్‌ల సహాయంతో ఇప్పటివరకు దాదాపు 50 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు రెస్క్యూ 1122 ప్రతినిధి బిలాల్ ఫైజీ తెలిపారు. మొత్తం 60 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.