Trump : బాంబులు వేయండి.. డొనాల్డ్ ట్రంప్ సంచలనం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అప్ఘానిస్తాన్ సంక్షోభంపై స్పందించారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను టార్గెట్ చేశారు.

Donald Trump
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అప్ఘానిస్తాన్ సంక్షోభంపై స్పందించారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను టార్గెట్ చేశారు. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనిక దళాల ఉపసంహరణను ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. అమెరికా దళాలు వెనక్కిపోవడంతోనే అప్ఘానిస్తాన్ లో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయని, తాలిబన్లు రెచ్చిపోయారని ట్రంప్ అన్నారు.
అఫ్ఘానిస్తాన్ లో చిక్కుకున్న అమెరికన్లను ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా సురక్షితంగా తీసుకొచ్చేందుకు ట్రంప్ ఓ సలహా చెప్పారు. ముందుగా అమెరికా పౌరులను తరలించాల్సింది. ఆ తర్వాత మీ పరికరాలన్నీ తీసుకురావాల్సింది. ఆ తర్వాత స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాల్సింది. ఆపై మిలటరీ మొత్తాన్ని వెనక్కి రమ్మని చెప్పాల్సింది అని ట్రంప్ అన్నారు.
దళాలను ఉపసంహరించడానికి ముందు స్థావరాలపై బాంబులు వేయాల్సింది అన్న ట్రంప్ సూచన గందరగోళానికి దారితీసింది. ట్రంప్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని నెటిజన్లు అంటున్నారు. సొంత దళాలపైనే బాంబులు వేయాలని చెప్పినట్టుగా ట్రంప్ తీరు ఉందని విమర్శిస్తున్నారు. కాగా, అమెరికా సైనిక దళాలను ఉపసంహరిస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ట్రంప్ విమర్శలు చేస్తూనే ఉన్నారు.
అఫ్ఘానిస్తాన్ నుంచి సైనిక బలాల ఉపసంహరణ.. అటుపై తాలిబన్ల అలవోక ఆక్రమణ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి పెద్దఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా-నాటో దళాల ఉపసంహరణ ద్వారా తాలిబన్ల చేతికి దేశాన్ని అప్పజెప్పాడంటూ అఫ్ఘాన్ ప్రభుత్వం-ప్రజలు సైతం బైడెన్‌పై దుమ్మెత్తి పోశారు.
ఈ విమర్శలను బైడెన్ తిప్పికొట్టారు. అప్ఘాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నాం. రెండు దశాబ్దాల తర్వాత సరైన నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంపై మేం చింతించడం లేదు. అమెరికా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి అమెరికా దళాలను వెనక్కి రప్పించుకోవడం. రెండోది.. మూడో దశాబ్దంలోనూ మరింత సైన్యాన్ని పంపి.. మోహరింపు కొనసాగించడం. రెండో దారిలో కొనసాగకూడదనే మా నిర్ణయం ముమ్మాటికీ సరైందనే భావిస్తున్నాం అని బైడెన్ వెల్లడించారు.
అఫ్ఘానిస్తాన్‌లో జాతి నిర్మాణం అమెరికా బాధ్యత కాదని, అమెరికాపై ఉగ్ర దాడులను నిరోధించడమే లక్ష్యం అని బైడెన్ స్పష్టం చేశారు. 20 ఏళ్ల క్రితం అప్ఘానిస్థాన్‌లో ఆల్‌ఖైదాను అంతం చేశాం. బిన్ లాడెన్‌ను పట్టుకునేందుకు మేం వెనక్కి తగ్గలేదు. రెండు దశాబ్దాలుగా అప్ఘాన్ సైన్యానికి శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వానికి మనోధైర్యం అందించాం. కానీ, వాళ్లు పోరాట శక్తిని ప్రదర్శించలేకపోయారు. అక్కడి ప్రభుత్వం ఊహించిన దానికంటే వేగంగా పతమమైంది. ప్రస్తుతం అప్ఘానిస్థాన్‌లో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. అవసరమైతే అప్ఘాన్ ఉగ్రవాదంపై పోరాటం చేస్తాం. అఫ్ఘాన్ ప్రజలకు అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుంది అని బైడెన్ తేల్చి చెప్పారు.