ద్యావుడా.. అయస్కాంతంలా మారిపోవాలని 54 అయస్కాంతాలు మింగిన బాలుడు

Boy swallows 54 magnetic balls: తెలిసీ తెలియని వయసులో పిల్లలు చేసే పనులు చాలా చిత్రంగా ఉంటాయి. ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి, మరోసారి కోపం తెప్పిస్తాయి. ఒక్కో సందర్భంలో వారి తెలివిని మెచ్చుకోవాలో, ఏడ్వాలో కూడా అర్థం కాదు. యూకేలో ఓ 12ఏళ్ల బాలుడు చేసిన పని దాదాపు అలాంటిదే. ఆ పిల్లాడు చేసిన సిల్లీ పని డాక్టర్లతో పాటు తల్లిదండ్రులను విస్మయానికి గురి చేసింది. ఆ తర్వాత కడుపు చెక్కలయ్యే నవ్వుని తెప్పించింది. ఇంతకీ ఆ పిల్లాడు ఏం చేశాడో తెలుసా.. అయస్కాంతంలా మారిపోవాలని ఏకంగా 54 అయస్కాంతాలు మింగేశాడు. అనుకున్నది ఒక్కటైతే అయింది మరొకటి. అది కాస్తా ప్రాణాల మీదకు వచ్చింది. అదృష్టం కొద్దీ సేఫ్ గా బయటపడ్డాడు.
ఆ పిల్లాడి పేరు రైలీ మారిసన్. వయసు 12ఏళ్లు. అయస్కాంతం ఎలా పనిచేస్తుంది? పెద్ద పెద్ద వస్తువులను కూడా తన వైపునకు ఏ విధంగా లాగేసుకుంటుంది? అసలు మన శరీరంలో ఒక పెద్ద అయస్కాంతం ఉంటే ప్లేట్ల లాంటి వాటిని పట్టుకునే అవసరం ఉండదు కదా..! బ్యాగులను వీపునకు తగిలించుకునే ఇబ్బంది ఉండదు కదా.. అయస్కాంతం ప్రభావానికి అదే వీపును అంటిపెట్టుకొని ఉంటుంది కదా.. ‘అయస్కాంతం’ పాఠం విన్న తర్వాత మారిసన్ వేసుకున్న ప్రశ్నలివి.
ప్రశ్నలు వేసుకోవడంతోనే మారిసన్ ఆగలేదు. దాన్ని ప్రయోగాత్మకంగా చూద్దామనుకున్నాడు. అందుకోసం మాగ్నెటిక్ బాల్స్ మింగాడు. జనవరి 1న కొన్ని మాగ్నెటిక్ బాల్స్, జనవరి 4న మరిన్ని అయస్కాంతాలను మింగాడు. ఆ తర్వాత అవి ఎలా పనిచేస్తాయో చూద్దామనుకున్నాడు. చివరికి కడుపులో నుంచి ఏ కలర్‌తో బయటకు వస్తాయో తెలుసుకుందామనుకున్నాడు.
కానీ, కథ అడ్డం తిరిగింది. 54 బాల్స్ మింగడంతో కడుపులో గందరగోళం మొదలైంది. భరించలేని నొప్పి మొదలైంది. ఈ దశలో తల్లి దగ్గరికి వెళ్లి పొరపాటున అయస్కాంతాలను మింగానని మారిసన్ చెప్పాడు. కొడుకు అవస్థ చూసి ఆందోళనకు గురైన తల్లి వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలుడి కడుపు స్కాన్ చేయగా.. 20 నుంచి 30 వరకు చిన్న చిన్న అయస్కాంతాలు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు షాక్ కి గురయ్యారు.
వెంటనే నిపుణులైన డాక్టర్ల బృందం ఆ బాలుడికి ఎమర్జెన్సీ సర్జరీ చేసింది. కడుపులో నుంచి ఒక్కో మాగ్నెటిక్ బాల్ బయటకి తీశారు. అందుకు 6 గంటల సమయం పట్టింది. సర్జరీ తర్వాత లెక్కిస్తే.. 54 బాల్స్ ఉండటంతో నోరెళ్లబెట్టారు. బాలుడు.. పొరపాటున మాగ్నెటిక్ బాల్స్ మింగి ఉంటాడని తల్లిదండ్రులు, డాక్టర్లు తొలుత భావించారు. కానీ, సర్జరీ తర్వాత గుచ్చి గుచ్చి అడగటంతో మారిసన్ అసలు విషయం చెప్పాడు. అయస్కాంతంలా మారిపోవాలని, ఇనుప వస్తువులను అట్టిపెట్టుకోవాలని.. ఇలా చేశాను అని చెప్పాడు. అది విని షాకవ్వడం వారి వంతైంది. ఆ తర్వాత యు..సిల్లీ ఫెల్లో అంటూ.. కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు డాక్టర్లు.
కాగా, బాల్స్ ను బయటకు తీయడం ఏమాత్రం ఆలస్యమైనా బాలుడి విసర్జక వ్యవస్థ, ఇతర అవయవాలు దెబ్బతిని ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడేదని డాక్టర్లు చెప్పారు.