చైనా నుంచి బయటకు వచ్చేసే యోచనలో టిక్‌టాక్

  • Published By: vamsi ,Published On : July 12, 2020 / 01:50 PM IST
చైనా నుంచి బయటకు వచ్చేసే యోచనలో టిక్‌టాక్

Updated On : July 12, 2020 / 1:57 PM IST

తన ప్రధాన కార్యాలయాన్ని చైనా నుంచి తరలించే ఆలోచనలో ఉంది టిక్‌టాక్. భారతదేశంలో టిక్‌టాక్‌పై నిషేధం కారణంగా భారీ నష్టాలను చవిచూస్తుంది సదరు సంస్థ.

ఈ క్రమంలోనే బైట్‌డాన్స్ యాజమాన్యంలోని సంస్థ టిక్‌టాక్ తన ప్రధాన కార్యాలయాన్ని చైనా నుంచి తరలించేందుకు ఆలోచిస్తోంది. భారతదేశంలో టిక్‌టాక్ నిషేధం కారణంగా కంపెనీకి భారీ నష్టం వాటిల్లుతోందని, ఈ క్రమంలో కంపెనీలో చాలా మార్పులు చేయాలని యోచిస్తోంది.

తెలుస్తున్న వార్తల ప్రకారం, కొత్త మేనేజ్‌మెంట్‌ను టిక్‌టాక్ బోర్డుకు తీసుకురావాలని సంస్థ సీనియర్ అధికారులు పరిశీలిస్తున్నారు. అంతేకాదు.. సంస్థ ప్రధాన కార్యాలయాన్ని చైనా నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని భావిస్తుంది.

సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. “మా వినియోగదారుల గోప్యత మరియు భద్రతను నిర్ధారించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము. సృజనాత్మక ప్రతిభను బహిర్గతం చేసే మా వేదిక టిట్‌టాక్.

ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆనందాన్ని ఇస్తుంది. మేము మా వినియోగదారులు, సభ్యులు, కళాకారుల ఆసక్తి మరియు అధికారాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్నాము.” అని చెప్పారు.

గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులను గత నెలలో చైనా దొంగదెబ్బ తీసి చంపడంతో 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. భారత సార్వభౌమాధికారం, భద్రత మరియు గోప్యత కోసం నిషేధం విధించాలని నిర్ణయించుకుంది. భారతదేశంలో టిక్‌టాక్‌పై నిషేధం విధించిన వారం తరువాత, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో అమెరికాలో ఇతర చైనా యాప్‌లను నిషేధించే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలోనే టిక్‌టాక్ వినియోగదారుల డేటాను చైనా ప్రభుత్వంతో పంచుకున్నట్లు వచ్చిన ఆరోపణలను ఖండించింది సదరు సంస్థ. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు చైనాపై చర్యలు చేపట్టే అవకాశం ఉండడంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది సదరు సంస్థ.