Canadian Government To Give Tax Credits To Citizens Sheltering Those Fleeing Ukraine
Ukraine Citizens : కెనడా వాసులకు ఆ దేశ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. యుక్రెయిన్ పౌరులకు సాయం చేస్తే పన్ను నుంచి మినహాయింపు ఇస్తామని కెనడా ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే కెనడాకు చేరుకున్న యుక్రెయిన్ పౌరుల బాగోగులను దగ్గరుండా చూసుకుంటారో వారూ ప్రభుత్వానికి చెల్లించే పన్నులో మినహాయింపును ఇవ్వనున్నట్టు వెల్లడించింది. యుక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా చాలామంది యుక్రెయిన్లు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. శరణార్థులుగా పక్క దేశాలకు వలసలు వెళ్లిపోతున్నారు.
ఈ క్రమంలో యుక్రెయిన్ నుంచి కెనడా చేరుకున్న యుక్రెయిన్ ప్రజలకు సాయం చేసినవారికి పన్ను నుంచి రిలీఫ్ తప్పక లభిస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఈ విధానంపై యోచనలో ఉన్నామని త్వరలోనే దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్టు పేర్కొంది. పన్ను మినహాయింపు కల్పించడం ద్వారా కెనెడియన్లకు ఆర్థికంగా సహాయపడాలని భావిస్తున్నామని కెనడా మంత్రి సీన్ ఫ్రెజర్ తెలిపారు. కెనెడియన్లు యుక్రెయిన్లకు అందిస్తున్న సాయాన్ని తాము గమనిస్తూనే ఉన్నామని అన్నారు. యుక్రెయిన్ ప్రజలకు సాయం అందించే డబ్బులు ఆశించని ఎన్జీవోలతో ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. తద్వారా ఎక్కువ మందికి మద్దతునిచ్చినవారు అవుతామని మంత్రి ఫ్రెజర్ పేర్కొన్నారు.
కెనడాకు వచ్చే యుక్రెయిన్ ప్రజలు రెండేళ్లు కెనడాలో ఉండొచ్చని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో యుక్రెయిన్లు కెనడాలో మూడేళ్ల వరకు ఉండొచ్చునని మంత్రి సీన్ ఫ్రెజర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల పరిమితి నుంచి మూడేళ్లకు పెంచినట్టు తెలిపారు. రష్యా దాడులతో అన్నీ కోల్పోయిన యుక్రెయిన్ ప్రజలకు అండగా నిలబడాలని ప్రభుత్వం కెనడియన్లకు సూచనలు చేసింది.
యుక్రెయిన్లకు తాత్కాలిక నివాసాలతో పాటు, విద్యావకాశాలు కూడా కల్పించాలని భావిస్తున్నట్టు తెలిపింది. కెనడా ప్రభుత్వం నుంచి సాయం అవసరమైన యుక్రెయిన్ల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నామని ఆయన తెలిపారు. జాబ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కెనడాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఇచ్చి వారికి ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని కెనడా మంత్రి సీన్ ఫ్రెజర్ తెలిపారు.
Read Also : Ukrainian Army : యుక్రెయిన్ ఆర్మీ సంచలన ప్రకటన.. రష్యా యుద్ధాన్ని విరమించేది ఆ రోజే..?!