ఓ యాక్సిడెంట్ ముగ్గురి ప్రాణాలు కాపాడింది

  • Publish Date - October 25, 2019 / 11:52 AM IST

సాధారణంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు పోవటమో, క్షతగాత్రులై ఆస్పత్రి పాలవటమో జరుగుతూ ఉంటుంది. కానీ అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను కాపాడింది. అరిజోనా రాష్ట్రం రాజధాని ఫీనిక్స్ నగరంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని  స్ధానిక పోలీసుశాఖ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. 

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడటంతో ఒక కుటుంబం తమ చిన్నారితో కలిసి  రోడ్డు  దాటే ప్రయత్నం చేసారు. ఇంతలో ఒక కారు వేగంగా రెడ్ సిగ్నల్ దాటు ముందుకు వెళ్లేందుకు దూసుకు వచ్చింది.  అదే సమయంలో వీరి ఎదురునుంచి వచ్చిన మరో  కారు వేగంగా వస్తున్న ఇవతలి కారును ఢీ కొట్టింది.  దీంతో  వీరిని ఢీ కొట్టాల్సిన కారుతో సహా రెండు కార్లు  పక్కకు వెళ్లిపోయాయి. కాగా రెండు కార్లలోని వారికి స్వల్పగాయాలయ్యాయి.  రెడ్ సిగ్నల్ దాటాలని ప్రయత్నించి.. కుటుంబాన్ని ఢీ కొట్ట బోయిన కారు డ్రయివర్ మద్యం సేవించి ఉన్నాడని గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి వారిని తప్పించిన కారు చెవీ క్రూజ్ మోడల్. 

దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజిని పోలీసులు ట్విట్టర్ లో పోస్టు చేస్తూ..ట్రాఫిక్ సిగ్నల్స్ గమనించి, రూల్స్ పాటించకపోతే  ప్రాణాలు పోతాయని  హెచ్చరించారు. నెటిజన్లు మాత్రం “ఇండియన్ స్కూల్  రింగురోడ్డు దగ్గర  రోడ్డు దాటుతున్న కుటుంబాన్ని ఓ దేవ దూత  రూపంలో చెవీ క్రూజ్ కారు వచ్చి కాపాడింది అని కామెంట్ చేసారు.  దేవుడే వారి ప్రాణాలు కాపాడాడని మరి కొందరు కామెంట్ చేశారు.