ట్రయల్స్ లో ఉండగానే, కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి చైనా అనుమతి

  • Published By: naveen ,Published On : August 24, 2020 / 12:58 PM IST
ట్రయల్స్ లో ఉండగానే, కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి చైనా అనుమతి

Updated On : August 24, 2020 / 2:10 PM IST

ఎంపిక చేసిన పలు దేశీయ కంపెనీలు అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి చైనా అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. చైనా వ్యాక్సిన్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం హై రిస్క్ లో ఉన్నవారికి పరిమిత కాలం వరకు వ్యాక్సిన్ ఇవ్వొచ్చు. చైనా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి టాస్క్ ఫోర్స్ హెడ్ జెంగ్ జోంగ్ ఈ విషయాన్ని తెలిపారు. కొవిడ్ 19 టీకాల అత్యవసర వినియోగానికి నెల రోజుల క్రితమే చైనా అనుమతి ఇచ్చింది. జూలై 22 నుంచే చైనాలో వ్యాక్సిన్లు ఇస్తున్నారు. టీకాలు క్లినికిల్ ట్రయల్స్ లో ఉండగానే వాటిని ప్రజలకు ఇస్తున్నారని జెంగ్ తెలిపారు.



ఇప్పటికే తొలి డోసు టీకా తీసుకున్న వారిలో స్వల్ప ప్రతికూల ప్రతిచర్యలు కనిపించాయి. కానీ ఒక్కరిలోనూ జ్వరం రాలేదు. చైనా వ్యాక్సిన్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం, తీవ్రమైన ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో, క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న వ్యాక్సిన్లను తక్కువగా వినియోగించ వచ్చు. మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్లు ప్రజలకు ఇవ్వొచ్చు. వైద్య సిబ్బంది, ఆర్మీలో పని చేసేవారికి, కీలకమైన పనులు చేసే వారికి వ్యాక్సిన్ ఇవ్వొచ్చని జెంగ్ వెల్లడించారు.

ప్రస్తుతం చైనాకి చెందిన సైనో ఫార్మ్ కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది. ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఇందుకోసం పెరూ, మొరాకో, అర్జెంటీనా దేశాలతో ఒప్పందం చేసుకుంది. శీతాకలంలో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని, దీంతో ఫుడ్ మార్కెట్లు, రవాణ, సర్వీస్ సెక్టార్లలో పని చేసే వారికి అత్యవసరంగా వ్యాక్సిన్లు ఇస్తామని చెప్పారు.



ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి స్పందించాడు. ఆగస్టు 7న నేడు నా కొలీగ్స్ వ్యాక్సిన్ తీసుకున్నాము. మాకు ఎలాంటి ప్రతికూల ప్రతి చర్యలు కనిపించ లేదు. అందరూ బాగానే ఉన్నాము అని చెప్పాడు. వ్యాక్సిన్ తీసుకున్న రోజున కాస్త మత్తుగా అనిపించింది, ఆ తర్వాత వెంటనే రికవర్ అయ్యాము అని తెలిపాడు. ఎలాంటి రెడ్ నెస్ కానీ, వాపు, నొప్పి ఏమీ లేవు. ఒక్కరికి కూడా జ్వరం రాలేదు అని అతడు తెలిపారు. త్వరలోనే రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అతడు వెల్లడించాడు. దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లపై మేము నమ్మకంగా ఉన్నాము, దీని కారణంగా ప్రజలు రిలాక్స్ గా ఫీల్ అవుతారు అని అతడు చెప్పాడు.

ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలా తక్కువ స్థాయిలో ప్రతికూల ప్రతిచర్యలు కనిపించాయి అని ఆగస్టు 13న సైనో ఫార్మ్ తెలిపింది. సైనో ఫార్మ్ ఫేజ్ 3 ట్రయల్స్ లో భాగంగా యూఏఈలో 20వేల మందికి పైగా ఇన్ యాక్టివేటేడ్ వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఎవరికీ ఎలాంటి సమస్యా రాలేదు. వ్యాక్సిన్ బాగానే పని చేసిందని సైనో ఫార్మ్ ప్రతినిధులు తెలిపారు.