China Highspeed Trine: రైలా..? రాకెట్టా?.. జస్ట్ 7 సెకన్లలో 600 కి.మీ వేగాన్ని అందుకోగల ట్రైన్..

హైస్పీడ్ రైలు నెట్‌వర్క్ పై చైనా గత కొన్నేళ్లుగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా.. విమానంతో పోటీపడి ప్రయాణించే ఓ సరికొత్త రైలును పరిచయం చేసింది.

China Highspeed Trine: రైలా..? రాకెట్టా?.. జస్ట్ 7 సెకన్లలో 600 కి.మీ వేగాన్ని అందుకోగల ట్రైన్..

China highspeed Trine

Updated On : July 17, 2025 / 6:46 AM IST

China Highspeed Trine: హైస్పీడ్ రైలు నెట్‌వర్క్ పై చైనా గత కొన్నేళ్లుగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా.. విమానంతో పోటీపడి ప్రయాణించే ఓ సరికొత్త రైలును (High Speed Train) పరిచయం చేసింది. విమానం గంటకు 800 నుంచి 900 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.. ప్రస్తుతం చైనా పరిచయం చేసిన హైస్పీడ్ రైలు.. గంటకు 600 కిలోమీటర్లుకుపైగా వేగంతో దూసుకెళ్తుందట. తాజాగా 17వ మోడ్రన్‌ రైల్వే ఎగ్జిబిషన్‌లో రైలును చైనా ప్రదర్శించింది. దీంతో, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

 

చైనా విజయవంతంగా మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీతో సరికొత్త హైస్పీడ్ రైలును ఆవిష్కరించింది. ఇది కేవలం ఏడు సెకన్లలోనే 600 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందట. బీజింగ్ నుంచి షాంఘై మధ్య 1200 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 5.30 గంటల సమయం పడుతుంది. చైనా కొత్తగా ఆవిష్కరించిన మాగ్లెవ్ హైస్పీడ్ రైలు కేవలం 150 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకుంటుంది.


చైనాలోని హైస్పీడ్ రైలు వ్యవస్థ అతిపెద్దది. గతేడాది చివరి నాటికి మొత్తం 48వేల కిలో మీటర్లకు హైస్పీడ్ రైలు వ్యవస్థ విస్తరించింది. 2025 చివరి నాటికి దీన్ని 50వేల కిలోమీటర్లకు పెంచాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. హైస్పీడ్ రైళ్ల అభివృద్ధిలోనూ ఆ దేశం దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో డోంఘు లాబొరేటరీలోని ఇంజనీర్లు 2025 చివరి నాటికి తమ హై-స్పీడ్ ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.


మ్యాగ్నెటిక్‌ లెవిటేషన్‌ టెక్నాలజీ అయస్కాంత వ్యతిరేక క్షేత్రాలను ఉపయోగించుకొని.. ట్రాక్ నుంచి రైలును పైకి లేపడానికి సాయపడుతుంది. అప్పుడు ఫ్రిక్షన్ తగ్గి రైలు నిశ్శబ్దంగా, వేగంగా వెళ్లగలుగుతుంది. ఈ రైలు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ముందుభాగం బుల్లెట్ షేప్ ముక్కుతో ఉంటుంది. దీని బరువు 1.1టన్నులు. ఈ ఏడాది జూన్‌లో ఈ రైలును పరీక్షించారు. ఇది వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా చరిత్ర సృష్టించనుంది.