చంద్రుడిపై అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్న చైనా.. ఇంకా ఎయే ప్రణాళికలు వేసుకుందో తెలుసా?
సమీప భవిష్యత్తులో మానవ సహిత జాబిల్లి మిషన్‌ను చైనా చేపట్టనుంది.

జాబిల్లిపై సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని చైనా భావిస్తోంది. అంతేగాక, 2050 నాటికి ఇతర గ్రహాల్లోనూ నివాస ప్రాంతాలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికల గురించి చైనా ప్రకటన చేసింది.
కొన్ని దశాబ్దాలలో పూర్తి చేయాల్సిన అంతరిక్ష ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకుంది. చంద్రుడిపై అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించడం, నివాసయోగ్యమైన గ్రహాల గురించి అన్వేషించడం వంటి ప్రాజెక్టులు చేపట్టాలని చైనా నిర్ణయించింది. 2024 నుంచి 2050 వరకు చేయాల్సిన ప్రాజెక్టులపై రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకుంది చైనా.
సమీప భవిష్యత్తులో మానవ సహిత జాబిల్లి మిషన్‌ను చైనా చేపట్టనుంది. భూమి కంటే మరింత ఉత్తమమైన నివాసయోగ్యమైన గ్రహాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని పరిశోధించాలని చైనా భావిస్తోంది. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ (సీఏఎస్) ఉపాధ్యక్షుడు డింగ్ చిబియావో తెలిపిన వివరాల ప్రకారం.. లూనార్ స్పేస్ స్టేషన్ నిర్మాణం దశలవారీగా జరగనుంది. 2028-2035 మధ్య దీన్ని నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
లూనార్ స్పేస్ స్టేషన్ పూర్తై, అది పనిచేయడం ప్రారంభించాక, అది సౌర వ్యవస్థ అంతటా పరిశోధనలకు కీలకంగా మారనుంది. ఖగోళ వస్తువులపై లోతైన పరిశోధన చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చైనా ఇప్పటికే జాబిల్లిపై చేపట్టిన మిషన్లు అక్కడి ఉపరితలంపై కీలకమైన విషయాలను సేకరించడానికి తోడ్పడ్డాయి.
భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్ట్‌లకు ఊతం ఇచ్చాయి. చైనా శాస్త్రవేత్తలు చంద్రుడిపై ఉపరితల వాతావరణం గురించి అవగాహనకు రావడమే కాకుండా భవిష్యత్తులో మరింత అధునాతన అంతరిక్ష వెంచర్‌ల తయారీకి కూడా దోహదపడేలా అప్పటి ప్రయోగాలు తోడ్పడ్డాయి.