CHINA JAWANS FACING PROBLEMS తూర్పు లడఖ్ లోని ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ) వెంబడి ఉన్న చైనా సైన్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అత్యంత శీతల వాతావరణంలో దుస్తుల కొరతతో తిప్పలు పడుతున్నారు చైనా సైనికులు.
దుర్భరమైన పరిస్థితులు, అతి తక్కువ ఉష్ణోగ్రతలు, కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య చైనా సైనికుల మనోధైర్యం సన్నగిల్లిందని నిఘా వర్గాలు తెలిపాయి వెల్లడించాయి.సైనికుల మనో ఉల్లాసం కోసం డ్రాగన్ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
భారత సరిహద్దులో యథాతథ స్థితిని సవాల్ చేస్తూ సైన్యాన్ని ఎల్ఏసీ వద్ద భారీగా మోహరించింది చైనా. వేలాది మంది సైనికులను వాస్తవాధీన రేఖకు చేర్చింది. ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడం వల్ల డ్రాగన్ సేనలు తీవ్ర అవస్థలు పడుతున్నారని అధికారులు తెలిపారు. వారి నైతిక స్థితి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిందని వివరించారు.
ఈ పరిస్థితుల్లో వీరికి ధైర్యం కల్పించేందుకు వినోద కేంద్రాలను చైనా ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిట్నెస్ సెంటర్లు, వేడినీటి ఈత కొలనులు, హాట్ టబ్‌లు, గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పాయి. వినోద కేంద్రాలలో కంప్యూటర్లు, ప్లే స్టేషన్లను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాయి. భారత్‌లోని చుషుల్కు సమీపంలో ఉండే మోల్డోని సైనిక శిబిరంలో ఇలాంటి ఓ వినోద కేంద్రం నెలకొల్పినట్లు వివరించాయి.
విపరీతమైన చలి ఉన్న నేపథ్యంలో చైనా సైనికులు సరైన దుస్తులు, వసతి సౌకర్యాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. శీతల వాతావరణాన్ని తట్టుకొనే ప్రత్యేకమైన దుస్తుల కొరత ఏర్పడిందని.. వీటిని అత్యవసరంగా కొనుగోలు చేసేందుకు చైనా ఏర్పాట్లు చేసుకుందని తెలిపారు.
ఎల్ఏసీ వద్ద ఎనిమిది నెలలుగా భారత్, చైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సైనిక, దౌత్య మార్గాల్లో పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ.. ఇంతవరకు ఎలాంటి ఫలితం లభించలేదు. ఓవైపు శాంతి చర్చల పేరుతో దృష్టి మరల్చి.. మరోవైపు సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది చైనా. సరిహద్దులో చైనా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
తాజాగా సించె-లా పాస్‌కు 2.5 కిలోమీటర్ల దూరంలో చైనా ఏకంగా ఆయుధ బంకర్లు నిర్మించినట్లు తేలింది. 2017లో భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్టంభనకు కారణమైన డోక్లాం నుంచి ఈ ప్రాంతం కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. నిజానికి గతేడాది డిసెంబర్‌లో ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు లేనట్లు అప్పటి శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అక్టోబర్ 28న తీసిన ఫొటోల్లో మాత్రం నిర్మాణాలు పూర్తయినట్లు కనిపించింది. అంటే ఏడాదిలోపే ఈ బంకర్ల నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది.
డోక్లాం ప్రాంతంలో మరోసారి వివాదం తలెత్తితే చైనా బలగాలు సమర్థంగా పోరాడేలా ఈ బంకర్లను ఏర్పాటు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్కన ఈ ప్రాంతంలో తమ బలగాలను పెంచే ఆలోచనలో చైనా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే జరిగితే మరోసారి డోక్లాంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది.