భారత్‌ దెబ్బకు తోక ముడిచిన చైనా.. గాల్వన్‌ లోయ నుంచి డ్రాగన్ సైన్యం వెనక్కి!

భారత్‌, చైనా సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతున్న సమయంలో తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా తన సైనికులను కనీసం ఒక కిలోమీటర్ దూరం వెనక్కి ఉపసంహరించుకుంది. గల్వాన్ నది వంపు నుంచి చైనా సైనికులు వైదొలగడం ప్రారంభించారు. ఈ ప్రాంతం నుండి గుడారాలను తొలగించారు.

డ్రాగన్‌ చర్యలకు భారత్ దీటుగా బదులిస్తోండడం.. అంతర్జాతీయంగా భారత్‌కు పలు దేశాలు మద్దతు ప్రకటనలు రావడం.. ఈ పరిణామాల మధ్య శాంతి కోసం భారత్‌తో చర్చల్లో పాల్గొంటోన్న చైనా సైన్యం గాల్వన్‌ లోయ నుంచి తోక ముడిచింది. అయితే, చైనా పారదర్శకంగా వ్యవహరిస్తుందా? మళ్లీ సైన్యాన్ని ముందుకు పంపేందుకు ఎత్తులు వేస్తుందా? అన్న విషయాలపై తాము దృష్టి పెట్టినట్లు భారత అధికారులు చెప్పుకొచ్చారు.

భారత్, చైనా రెండు దేశాలు కూడా పోటాపోటీగా సైనిక చర్యలకు సిద్ధం అవగా.. ఉద్రిక్తతలను తగ్గించడానికి జరిగిన చర్చల ఫలితంగా గాల్వ‌న్‌, పాన్‌గాంగ్ సో, హాట్ స్ప్రింగ్స్ నుంచి సైనికుల‌ను వెన‌క్కి పంపాల‌ని ఇటీవలే ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.

దశల వారీగా ఇరు దేశాలు తమ సైన్యాన్ని వెనక్కు రప్పించుకునే అవకాశం ఉంది. తొలి దశలో బలగాలను వెనక్కి పిలిపించిన తర్వాత.. చైనా సైన్యం నిజంగానే వెనక్కి వెళ్లిందా? అన్న అంశాన్ని నిర్ధారించుకుని, రెండో దశలో మరిన్ని బలగాలను భారత్ వెనక్కి తీసుకోనుంది.

అంతకుముందు జూన్ 22 న ఇరుపక్షాల మధ్య జరిగిన చర్చలలో, తూర్పు లడఖ్ లోని అన్ని ఉద్రిక్త ప్రదేశాలకు తిరిగి వెళ్ళడానికి పరస్పర ఒప్పందం జరిగింది. ఎల్‌ఐసి సమీపంలోని చైనా భూమిపై మోల్డోలో మొదటి రెండు రౌండ్ల చర్చలు జరిగాయి.

7 వారాలుగా భారత్, చైనా దళాల మధ్య ఉద్రిక్తతలు:

గత ఏడు వారాలుగా భారత, చైనా దళాల మధ్య ఉద్రిక్తతలు తూర్పు లడఖ్‌లోని వివిధ ప్రదేశాలలో ఉన్నాయి మరియు జూన్ 15 న గాల్వన్ లోయలో ఇరు దేశాల దళాలు ఘర్షణ పడినప్పుడు ఈ ఉద్రిక్తత మరింత పెరిగింది. హింసాత్మక ఘర్షణలో, భారత సైన్యం 20 మంది సైనిక సిబ్బందిని కోల్పోయింది. చైనా వైపు కూడా చనిపోయినప్పటికీ, సైనికుల వివరాలు బయటకు రాలేదు.

Read Here>>ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం