కరోనా ఎక్కడ పుట్టిందో తెలియదు…వైరస్ వెలుగులోకొచ్చిన హుబే ప్రావిన్స్ లో కొత్త కేసుల్లేవ్

చైనాలోని హుబే రాష్ట్రంలోని వుహాన్ సిటీలో దాదాపు మూడు నెలల క్రితం కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. అయితే ప్రాణాంతక కరోనా వైరస్ జన్మస్థానం ఎక్కడో చెప్పడం కష్టంగానే ఉన్నది. ఆ వైరస్ జన్యు మూలాలను గుర్తించక ముందే…దాని గురించి స్పష్టమైన ప్రకటన చేయడం అవివేకమే అవుతుందని తాజాగా చైనా తెలిపింది. ఆ దేశానికి చెందిన శ్వాసకోస వ్యాధుల నిపుణుడు జాంగ్ నాన్‌షాన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. (కరోనా ఎఫెక్ట్: జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా)
కరోనా వైరస్ వుహాన్‌లో వెలగులోకి వచ్చిన విషయం వాస్తవమే అయినా…అది అక్కడకు ఎలా వచ్చిందన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదని జాంగ్ అన్నారు. వుహాన్‌లో కరోనా తొలి లక్షణాలు గుర్తించినా…అది ఆ నగరంలోనే పుట్టినట్లు కాదన్నారు. వుహాన్ లోనే కరోనా ఆవిర్భవించినట్లు ఆధారాలు లేవన్నారు. ఇది ఓ సైద్ధాంతిక ప్రశ్న అని ఆయన తెలిపారు. వైరస్ క్రమక్రమేనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. వైరస్ పుట్టుకకు సంబంధించిన లక్షణాలు బయటపడుతాయని జాంగ్ చెప్పారు.
వైరస్ జన్యుక్రమం తెలియకుండానే, అది ఏ చోటు నుంచి వచ్చిందో చెప్పడం బాధ్యతారాహిత్యమే అవుతుందని ఆయన అన్నారు. వైరస్ ఎక్కడ పుట్టిందన్న దానిపై తమకు సమగ్రమైన సమాచారం లేదన్నారు. వైరస్ సోర్స్ ఏంటో తెలియదన్నారు. చైనా నుంచే ఆ వైరస్ విశ్వవ్యాప్తమైందన్న విషయాన్ని తాను గతంలో చెప్పానని, కానీ వైరస్ పుట్టడానికి గల కారణాలు తనకు తెలియదన్నారు. వైరస్ ఏ కుటుంబానికి చెందినదని, దాని జీవవైవిధ్యం, వైరస్ పురోగతికి సంబంధించి భవిష్యత్తులో తెలుస్తాయన్నారు.
ఇది చైనీస్ వైరస్ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో చైనా ఈ వివరణ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరోవైపు హుబే రాష్ట్రంలో గురువారం ఒక్క కరోనా కేసు కూడా రిపోర్ట్ కాలేదు. దాదాపు 81,000 మంది చైనీయులకు సోకిన ఈ అంటువ్యాధిలో ఇది ఒక పెద్ద మలుపు.