హింసాత్మకంగా మారిన ట్రంప్ మద్దతుదారుల నిరసన

  • Published By: venkaiahnaidu ,Published On : November 15, 2020 / 05:27 PM IST
హింసాత్మకంగా మారిన ట్రంప్ మద్దతుదారుల నిరసన

Updated On : November 15, 2020 / 6:20 PM IST

Clashes break out between Trump supporters, counter-protesters అమెరికా అధ్యక్షడు డొనాల్డ్​ ట్రంప్​కు మద్దతుగా తాజా ఎన్నికల ఫలితాలపై వాషింగ్టన్​లో చేపట్టిన ‘మిలియన్​ మెగా మార్చ్​’ ర్యాలీ హంసాత్మకంగా మారింది. ట్రంప్ మద్దతుదారులు,​ నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడగా.. వీరిలో పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం.



ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించినా ప్రస్తుత అధ్యక్షుడు తన ఓటమిని అంగీకరించకపోవడాన్ని మనం చూస్తున్నాం. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, మోసపూరితంగా తన విజయాన్ని లాగేసుకుంటున్నారని ట్రంప్, ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై శనివారం మిలియన్​ మెగా మార్చ్ పేరుతో రాజధాని వాషింగ్టన్ లోని వైట్ హౌస్ సమీపంలోని ఫ్రీడమ్​ ప్లాజా దగ్గర ట్రంప్​కు మద్దతుగా ర్యాలీలు కొనసాగుతుండగా… ఆయనను వ్యతిరేకించే నిరసనకారుల సమూహం అక్కడికి చేరుకుంది. దీంతో ట్రంప్​ మద్దతుదారులు చుట్టుముట్టి యూఎస్​ఏ.. యూఎస్​ఏ అంటూ నినాదాలు చేశారు. ఇది ఘర్షణకు దారి తీసింది.



పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైట్‌ హౌస్‌ కు కొద్ది దూరంలోనే ఉన్న ఫ్రీడం ప్లాజా వద్ద ట్రంప్‌కు మద్దతుగా నిరసన ర్యాలీ చేపట్టిన వారిలో ‘ప్రౌడ్‌ బాయ్స్‌’, యాంటిఫా వంటి కన్సర్వేటివ్‌ గ్రూప్‌‌లు ఉన్నాయి. వీరి ప్రత్యర్థి వర్గం ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఓ సందర్భంలో తారసపడటంతో ఒకరికొకరు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఈ సమయంలో బాహాబాహీకి దిగిన వీరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.



క్రమంగా ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చడంతో ట్రంప్‌ మద్దతు దారుల చేతిలో ఉన్న ఎరుపు రంగు టోపీలు, జెండాలను లాక్కొని ప్రత్యర్థి వర్గం నిప్పంటించింది. వీటిని అమ్ముతున్న టేబుళ్లను ధ్వంసం చేయడంతో ఓ దశలో పరిస్థితి చేజారిపోయింది. తక్షణమే స్పందించిన భద్రతా దళాలు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పెప్పర్‌ స్ప్రే వంటివి వినియోగించి, మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.



కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు ముందుగానే హెచ్చరించిన విషయం తెలిసిందే. ట్రంప్ ఓటమిపాలైతే ఆయన మద్దతుదారులు.. బైడెన్ ఓడిపోతే ఆయన మద్దతుదారుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆందోళనల సమయంలో లూటీలు జరగకుండా ప్రపంచ ఆర్ధిక రాజధాని నగరం న్యూయార్క్‌ నుంచి వాషింగ్టన్‌ వరకూ చికాగో నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వరకూ వ్యాపార సంస్థలన్నీ రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాయి.