కరోనా సోకిందనే అనుమానంతో చంపేశారు

  • Publish Date - February 14, 2020 / 04:46 AM IST

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కోవిడ్‌- 19(కరోనా వైరస్‌) పేరు వింటేనే వణికిపోతున్నారు ప్రజలు. చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే చాలా దేశాలకు వ్యాపించింది. కోవిడ్‌- 19(కరోనా వైరస్‌) ప్రపంచ దేశాలు మందును కనుక్కొనేందుకు చూస్తుండగా.. ఉత్తర కొరియా మాత్రం ఆ వ్యాధి సోకినట్లుగా భావించిన  వ్యక్తిని చంపేసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ నియంతృత్వ పోకడలకు అద్దం పట్టే విధంగా అత్యంత పాశవికంగా హతమార్చింది. 

వివరాల్లోకి వెళ్తే..  ఉత్తరకొరియాలో ఇప్పటికే చైనాకు ఉన్న సరిహద్దులను మూసేశారు. దౌత్యపరంగా ఉత్తరకొరియాకు మిత్రపక్షంగా ఉన్న ఏకైక దేశం చైనా. అయితే కరోనా వైరస్‌ వస్తుందనే అనుమానంతో ఉత్తర కొరియా చైనాతో ఉన్న సరిహద్దులను మూసేసింది. విదేశీయులను కూడా ఎప్పటికప్పుడు నిర్బంధంలోకి తీసుకుంటుంది. ఈ మేరకు అధికారులకు సహకరించాలని ఆదేశాలు విడుదల చేసింది. అదే విధంగా చైనాకు వెళ్లివచ్చిన తమ దేశ పౌరులు, అధికారులను నిర్బంధించడమే కాక వాళ్లకు కరోనా పరిక్షలు కఠినంగా చేస్తుంది. 

ఈ క్రమంలోనే కరోనా సోకిందనే అనుమానంతో నిర్బంధంలో ఉంచినవారిలో నుంచి బయటకు వచ్చి బయట స్నానం చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సదరు వ్యక్తిని కాల్చి చంపేశారు. ఈ మేరకు దక్షిణ కొరియాకు చెందిన డాంగ్‌- ఆ ఇల్బో అనే వార్తాపత్రిక ఓ కథనం రాసింది. ఉత్తర కొరియాలో ఒక్క కరోనా వైరస్‌ కూడా నమోదు కాలేదన్న విషయం అబద్ధమని.. ఇప్పటికే వైరస్‌ కారణంగా అక్కడ పలువురు వ్యక్తులు మృత్యువాత పడ్డారంటూ వెళ్లడిస్తూ.. ఈ విషయాన్ని కూడా చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఉత్తర కొరియాలో కరోనా మరణాలు గురించి సమాచారం లేదని చెబుతుంది.